గోదావరిఖనిలో షాపులను కూల్చివేసిన సింగరేణి
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:09 AM
గోదావరిఖని తిలక్‌నగర్ సెంటర్‌లో జంక్షన్ అభివృద్ధిలో భాగంగా నగరపాలక సంస్థ కొన్ని షాపులను తొలగించింది. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి రెండు క్వార్టర్లను కూడా తీయించారు.
కోల్‌సిటీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని తిలక్‌నగర్ సెంటర్‌లో జంక్షన్ అభివృద్ధిలో భాగంగా నగరపాలక సంస్థ కొన్ని షాపులను తొలగించింది. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి రెండు క్వార్టర్లను కూడా తీయించారు. బాధితులకు సింగరేణి అక్కడ షటర్లు కట్టి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా అప్పటి సీఎండీ బలరాంనాయక్ పరిశీలించి సానుకూలంగా స్పందించారు. ఆ తరువాత బడ్జెట్ మంజూరు కాకపోవడంతోనే బాధితులే సొంత డబ్బులతో షాపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. గురువారం తెల్లవారుజామున ఫిర్యాదులు అందాయంటూ సింగరేణి సెక్యూరిటీ బందోబస్తు మధ్య ఎస్టేట్ విభాగానికి చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్ ఎక్స్‌కవేటర్‌తో నిర్మాణంలో ఉన్న షాపులు కూల్చివేసింది. తమ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారంటూ కూల్చివేస్తుండగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, స్థానిక కార్పొరేటర్ ముస్తాఫా అడ్డుకున్నారు. బాధితులు ఎదురుతిరగడంతో సింగరేణి సిబ్బంది వెళ్లిపోయారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఘటన స్థలాన్ని పరిశీలించి సింగరేణి యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు సింగరేణి ఎస్టేట్ అధికారులపై గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ నిర్మాణాలను అకారణంగా కూల్చివేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా సాయంత్రం మళ్లీ సింగరేణి అధికారులు బోర్డులు పట్టుకుని రాగా బాధితులు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు కౌశిక హరి, తదితరులు సింగరేణి చర్యలను ఖండించారు. బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
అక్రమ నిర్మాణాలపై చర్య
సింగరేణికి చెందిన స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన అక్రమ నిర్మాణాలను స్పెషల్ స్క్వాడ్ బృందం కూల్చివేసినట్టు సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొన్నది. తమ అనుమతి లేకుండా సింగరేణి భూమిలో ఎవరైనా అక్రమ నిర్మాణాలకు పాల్పడితే తొలగిస్తామని పేర్కొన్నది. అధికారుల చర్యలను స్థానికులు, అన్నీవర్గాల వారు హర్షించారని, ప్రభుత్వ, సింగరేణి భూములను రక్షించేందుకు ఇలాంటి ప్రత్యేక చర్యలను కొనసాగించాలని కోరినట్టు యాజమాన్యం పేర్కొన్నది.