Share News

ఆరు నెలల్లో గణనీయమైన మార్పు తీసుకురావాలి

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:44 PM

సమష్టి కృషితో ఆరు నెలల్లో రాష్ట్రంలో గణనీయమైన మార్పు తీసుక వచ్చేలా ప్రతీ ఒక్క అధికారి పని చేయాలని, వాటి సాధన దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు కలెక్టర్లను ఆదేశించారు. శనివారం వివిధ అంశాలపై ఆయన హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఆరు నెలల్లో  గణనీయమైన  మార్పు తీసుకురావాలి

పెద్దపల్లి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): సమష్టి కృషితో ఆరు నెలల్లో రాష్ట్రంలో గణనీయమైన మార్పు తీసుక వచ్చేలా ప్రతీ ఒక్క అధికారి పని చేయాలని, వాటి సాధన దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు కలెక్టర్లను ఆదేశించారు. శనివారం వివిధ అంశాలపై ఆయన హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటివరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులకు రైతుభరోసా అందుతున్న నేపథ్యంలో రైతుల మొబైల్‌ నంబర్లు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని, ప్రతీ రైతుకు తెలుగులో వ్యవసాయ సూచనలు, వర్షపాతం వివరాలు, వాతావరణ హెచ్చరికలు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పంపించాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన యూరియా నిల్వలు రాష్ట్రంలో తగినంతగా ఉన్నాయని, అవసరమైన సమయంలో యూరియా అందేలా చూడాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యాన పంటలు, ముఖ్యంగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం బోనస్‌ అందిస్తున్న ఏడు రకాల సన్న వరి వంగడాలపై రైతులకు స్పష్టమైన సమాచారం చేరేలా చూడాలని, ఆయా వంగడాల విత్తనాలు ప్రతీ మండలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గిస్తూ కూరగాయల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతీ శుక్రవారం అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో డ్రైడే నిర్వహించాలని, గురుకులాలు, హాస్టళ్లలో పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు అమలులోకి వచ్చిన వీబీజీ రామ్‌జీ పథకాన్ని అన్ని జిల్లాల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గ్రామస్థాయిలో చేపట్టే తాగునీటి పనులకు ఈ పథకంలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యాశాఖలో మధ్యాహ్న భోజన పథకం, అల్పాహార పథకాలను నాణ్యతతో అమలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, డీఈవో శారద, డీఎంహెచ్‌వో డాక్టర్‌ పవిత్ర, ఆర్‌డీఓలు గంగయ్య, సురేష్‌, మిషన్‌ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీనివాస్‌, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 11:44 PM