సాగుకు కూలీల కొరత
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:39 AM
వరి నాట్లు వేయడంలో ఎదురవుతున్న కూలీల సమస్యలు అదిగమించేందుకు అన్నదాతలు పొరుగు రాష్ట్రాల కూలీలపై ఆధారపడుతున్నారు. సీజన్‌లో నాట్లు వేయడానికి కూలీలు లభించకపోవడం, దొరికిన కూలీల ధరలు ఎక్కువగా ఉండడం, అర్ధాంతరంగా పనులు వదిలి ఎక్కువ కూలీలు డిమాండ్ చేస్తుండడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్న రైతులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలకు పనులను అప్పగిస్తున్నారు.
జగిత్యాల, ఆగస్టు1 (ఆంధ్రజ్యోతి): వరి నాట్లు వేయడంలో ఎదురవుతున్న కూలీల సమస్యలు అదిగమించేందుకు అన్నదాతలు పొరుగు రాష్ట్రాల కూలీలపై ఆధారపడుతున్నారు. సీజన్‌లో నాట్లు వేయడానికి కూలీలు లభించకపోవడం, దొరికిన కూలీల ధరలు ఎక్కువగా ఉండడం, అర్ధాంతరంగా పనులు వదిలి ఎక్కువ కూలీలు డిమాండ్ చేస్తుండడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్న రైతులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలకు పనులను అప్పగిస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా బీహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు జిల్లాకు వలస బాట పడుతున్నారు.
జిల్లాలో 2.7 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సుమారు 2.70 లక్షల ఎకరాలల్లో వరి సాగు చేస్తారన్న అంచనాలున్నాయి. బీహార్, పశ్చిమ బెంగాల్ కూలీల రాకతో వరి నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు సగానికి పైగా వరి నాట్లు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. అధిక మొత్తంలో వరి పండిస్తుండడంతో నాట్లు వేయడానికి కూలీల సమస్య ఎదురవుతోంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో కూలీల సమస్య మరింత పెరగడంతో పొరుగు రాష్ట్రాల నుంచి జగిత్యాల జిల్లాకు రప్పించి నాట్లు వేసే పనులను అప్పగిస్తున్నారు.
సగానికి పైగా పూర్తయిన వరి నాట్లు
వానాకాలం సీజన్‌లో వరి నాట్లు వేయడానికి సుమారు 250 మంది కూలీలు బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి జిల్లాకు వచ్చారు. ఉపాధిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ముమ్మరంగా నాట్ల పనులు చేస్తున్నారు. 15 నుంచి 20 మందికి ఒక జట్టు చొప్పున రెండు జట్లుగా ఏర్పడి వ్యవసాయ పనులు నిర్వహిస్తున్నారు. ఎకరానికి డిమాండ్‌ను బట్టి రూ.4,500 నుంచి రూ.5,500 వరకు తీసుకుంటున్నారు. ఒక్కో రోజు రెండు జట్లు సుమారు ఐదు, ఆరు ఎకరాల్లో వరి నాట్లు పూర్తి చేస్తున్నారు. గ్యాంగ్‌మెన్‌లుగా పిలువబడుతున్న పలువురు ప్రత్యేక ప్రైవేటు ఏజెంట్లు బీహార్ నుంచి జగిత్యాల జిల్లాకు వరి నాట్ల కోసం కూలీలను ఇక్కడికి తీసుకువస్తున్నారు. వీరికి పనులు నిర్వహిస్తున్న ఆయా గ్రామాల్లో గల కమ్యూనిటీ హాళ్లు, సంఘ భవనాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు.
ఫ వలస కూలీలకు వసతి సౌకర్యం
బీహార్ కూలీలకు కొందరు రైతులు భోజన వసతిని సైతం ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక కూలీలు రోజుకు మహిళలకు రూ.700, పురుషులకు రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారు. ఒక్క ఎకరంలో నాట్లు వేయడానికి నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు అవసరమవుతారు. వరి నాట్లు పనుల్లో బీహార్, పశ్చిమ బెంగాల్ కూలీలను దించడం వల్ల వేగవంతంగా అవుతున్నాయని అన్నదాతలు అంటున్నారు. నారు పీకడం, నారు కట్టలు కట్టడం, నారు పంచడంతో పాటు నాటు వేసే పనులను నిర్వహిస్తున్నారు. నాటు వేసే ప్రక్రియలో వ్యవసాయ భూమికి రెండు వైపులా తాడు కట్టుకొని సమానంగా వరుస క్రమంలో నాట్లు వేస్తున్నారు. దూరం దూరంగా నాటు వేయడంతో విస్తారంగా గాలి సోకి, అధిక పిలకలు వచ్చి, ఏపుగా పెరిగి పంట దిగబడి అధికంగా వస్తుందని బీహార్ కూలీలతో నాట్లు వేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. వీరు నాటు వేసే విధానంతో చీడ పీడల బెడద తక్కువగా ఉంటుందని రైతులు అంటున్నారు.
ఉపాధి కోసం వలస వచ్చాం
-బిశ్వజిత్, వ్యవసాయ కూలీ, జంగిపడా గ్రామం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వలస వచ్చాము. వ్యవసాయంలో వరి నాట్లు వేసే పనులను నిర్వహిస్తున్నాము. ఇక్కడి రైతులు ఉపాధి అందించడంతో పాటు మాకు భోజన వసతి, ఇతర సహకారాలు అందిస్తున్నారు. నాట్ల పనులు ముగియగానే తిరిగి వెళ్లిపోతాం.
బీహార్ కూలీలతో పనులు వేగవంతం
- చిట్యాల నర్సయ్య, రైతు, తిమ్మాపూర్ గ్రామం
వరి నాట్లు వేయడానికి స్థానికంగా కూలీల సమస్య ఎదురవుతోంది. దీన్ని అధిగమించేందుకు ఏజెంట్ల ద్వారా బీహార్ నుంచి వచ్చిన కూలీలకు పనులు అప్పగిస్తున్నాము. ఎకరానికి రూ.4,500 నుంచి రూ.5,000 తీసుకుంటున్నారు. వలస కూలీలు వేగవంతంగా పనులు చేస్తున్నారు. పలువురు రైతులు పశ్చిమ బెంగాల్, బీహార్ కూలీలతో నాట్లు వేయిస్తున్నారు.