సభకు సై
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:58 AM
బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల వేదికగా లక్ష మందితో సభను నిర్వహించి ఆ పార్టీకి సవాల్ విసరాలని కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఈనెల 30న కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, సిరిసిల్లలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల వేదికగా లక్ష మందితో సభను నిర్వహించి ఆ పార్టీకి సవాల్ విసరాలని కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఈనెల 30న కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, సిరిసిల్లలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. 22/ఏ నిషేధిత భూముల వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ వారు ప్రభుత్వ భూములను అక్రమంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారని ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీలో విమర్శించారు. సమావేశాలు ముగియగానే భూముల అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలకు సిఫారసు చేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేశారు. ప్రస్తుతం అదే భూముల ఆరోపణల అస్ర్తాలతో పాటు బీఆర్‌ఎస్ నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లాలో చేసిన అక్రమాలు, ఇసుక మైనింగ్, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో పొందిన లబ్ధి అంశాలతో సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను, దాని అగ్రనేతలను ఎండగట్టే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లాపై దృష్టి
ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం లేకుండా చూసి 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా సీఎం పావులు కదుపుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. భూములపై విచారణ అంశాల్లో బీఆర్‌ఎస్ ముఖ్యనేతలతోపాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్, సిరిసిల్ల జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ నేతలు సిరిసిల్ల తంగళ్లపల్లి మండలాల్లోని సర్దాపూర్, లక్ష్మిపూర్, తంగళ్ళపల్లి గ్రామాలలో ప్రభుత్వ భూముల అక్రమ కేటాయింపులు, అసైన్డ్ భూముల అక్రమ కొనుగోళ్ళు చేశారని విమర్శించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌రావు తండ్రి రవీందర్‌రావు బంధువు జె సౌమ్య మిడ్‌మానేరు రిజర్వాయర్ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని, పరిహారాన్ని అక్రమంగా పొందారని విచారణ చేయిస్తున్నారు. ఈ అంశాలన్నింటిని ముఖ్యమంత్రి మరోసారి ప్రశ్నిస్తూ బీఆర్‌ఎస్ నేతలను ప్రజల్లో దోషులుగా నిలబెట్టేందుకు సిరిసిల్ల సభను వేదికగా చేసుకోనున్నారని చెబుతున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కాంగ్రెస్
ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ దానిని విజయవంతం చేసేందుకు జిల్లా మంత్రులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మన్‌కుమార్, విప్ ఆది శ్రీనివాస్ శనివారం సిరిసిల్లలో పర్యటించారు. వీరు సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లకు సూచనలు చేశారు. మంత్రులు అక్కడే జరిగిన పార్టీ నేతలు, శ్రేణుల సమావేశంలో పలు రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ లక్ష మందితో ఈ సభను విజయవంతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లా నుంచి మాత్రమే ఈ సభకు జనాన్ని సమీకరించాలని అందులో సిరిసిల్ల జిల్లా నుంచే సగం మంది వచ్చేలా నాయకులకు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల క్రితం కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ అధ్యక్షతన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీనేతలు, శ్రేణులతో సమావేశం నిర్వహించి కరీంనగర్, సిరిసిల్లలో జరిగే సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించి బాధ్యతలు పంచుకున్నారు. ఉమ్మడి జిల్లాపరిధిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనే ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రి ఈ రెండు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డికి ఈ సభ ద్వారా చెక్‌పెట్టాలని చూస్తున్నారు.
-----------------------