ఆత్మ పథకానికి మోక్షం
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:29 AM
వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశబ్దకాలంగా నిధులు లేక ఆత్మ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ) పథకాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ఎట్టకేలకు ఆత్మ పథకానికి మోక్షం లభించింది.
కరీంనగర్ రూరల్, (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశబ్దకాలంగా నిధులు లేక ఆత్మ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ) పథకాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ఎట్టకేలకు ఆత్మ పథకానికి మోక్షం లభించింది. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో రైతులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞనాన్ని చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో కొన్నేళ్లుగా స్తబ్దంగా ఉన్న ఆత్మ కమిటీలు మళ్లీ పని చేయనున్నాయి. గడిచిన పదేళ్లల్లో నిధుల కొరతతో ఆత్మ కార్యకలాపాలు పూర్తిగా నిలిచి పోయాయి. క్షేత్రస్థాయిలో రైతులకు తోడ్పాటు అందించే ఈ వ్యవస్థ నీరసించిపోయింది. గతంలో ఈ పథకంలో పని చేసిన సిబ్బందిని వ్యవసాయ విస్తరణ అధికారులుగా సర్దుబాటు చేయడంతో ఆత్మ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పూర్వవైభవం సంతరించుకోనుంది.
జిల్లాకు రూ. 16.3 లక్షలు మంజూరు
జిల్లాలో కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, హుజూరాబాద్ డివిజన్లకు కలిపి మొత్తం 16.3 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఇందులో కరీంనగర్ డివిజన్‌కు 1.4 లక్షలు, చొప్పదండి డివిజన్‌కు 2.1 లక్షలు, మానకొండూర్ డివిజన్‌కు 3.1 లక్షలు, హుజురాబాద్‌కు 3.1 లక్షల రూపాయలను అందించారు. మిగతా 6.6 లక్షల రూపాయలను ఆత్మ పీడీకి, ఆత్మ ఎగ్జిబిషన్‌కు, కిసాన్ మేళాలకు ఖర్చు చేయనున్నారు. జిల్లా స్థాయి కమిటీల్లో 20 మంది సభ్యులు ఉంటారు. ఆత్మ పీడీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఒకరు కేవీకే కోఆర్డినేటర్, 18 మంది రైతులు ఉంటారు. డివిజన్లవారీగా చూసుకుంటే నాలుగు డివిజన్లకు 25 మంది చొప్పున 100 మంది సభ్యులు ఉంటారు. ఇందులో నుంచి 20 మంది సభ్యులను జిల్లా స్థాయి సభ్యులుగా తీసుకుంటారు. జిల్లా వ్యాప్తంగా ఈ డివిజన్ల పరిధిలో రైతులకు అవసరమైన సలహాలు సూచనల అందిచేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి,
రైతు ముంగిట సేవలు
ఆత్మ పథకం కింద సాగులో వస్తున్న ఆధునిక మార్పులపై రైతులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. కొత్త వంగడాలు, సాగు పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శనలు చేపడతారు. ఆదర్శ రైతుల వ్యవసాయ క్షేతాల్రకు, పరిశోధన కేంద్రాలకు రైతులను తీసుకెళ్తారు. విత్తనాలు, యంత్ర పరికరాలపై అవగాహన కల్పించేలా మేళాలు నిర్వహిస్తారు. రైతులు శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చించి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కల్పిస్తారు.
త్వరలో కార్యకలాపాలు ప్రారంభిస్తాం
- చత్రు నాయక్, పీడీ ఆత్మ
ఆత్మ కార్యకలాపాలు త్వరలో ప్రారంభిస్తాం. ఇందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. కలెక్టర్ ఆదేశాలతో కార్యక్రమం మొదలు పెడతాం. రైతులకు సాంకేతిక సాయం అందించడంతోపాటు రైతు మేళాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.