Share News

ధాన్యం కొనుగోళ్ళలో రూ.700 కోట్ల కుంభకోణం

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:42 PM

పెద్దపల్లి నియోజకవర్గంలో హెచ్‌అండ్‌టీ గోదాముల ద్వారా ఒక్క సంవత్సరంలోనే ఖరీఫ్‌, రబీ సీజన్ల ధాన్యం కొనుగోళ్శలో సుమారు రూ.700 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టెముక్కుల సురేష్‌ రెడ్డి ఆరోపించారు.

ధాన్యం కొనుగోళ్ళలో రూ.700 కోట్ల కుంభకోణం

సుల్తానాబాద్‌, జూలై 28 ఆంద్రజ్యోతి): పెద్దపల్లి నియోజకవర్గంలో హెచ్‌అండ్‌టీ గోదాముల ద్వారా ఒక్క సంవత్సరంలోనే ఖరీఫ్‌, రబీ సీజన్ల ధాన్యం కొనుగోళ్శలో సుమారు రూ.700 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టెముక్కుల సురేష్‌ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఈడీ, విజిలెన్స్‌, కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళి బీజేపీ తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సుల్తానాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు ప్రతీ 200 క్వింటాళ్ళ ధాన్యం లోడ్‌కు రూ.18 వేల చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో రైస్‌మిల్లర్లు, గోదాము నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. ధాన్యం రవాణా తదితర ఖర్చులను ఎఫ్‌సీఐ భరిస్తున్నప్పటికినీ రైతుల పై అదనపు భారం ఎందుకు మోపుతున్నారని ప్రశ్నించారు. ఒక్కో లారీపై రైతు రూ.18 వేలు నష్టపోతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎంఆర్‌ ధాన్యాన్ని గోదాముల్లో అన్‌లోడ్‌ చేయకుండా నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గోదాముల వద్ద జరుగుతున్న ఆక్రమ వసూళ్ళు అధికారులకు కనిపించడం లేదా అని నిలదీశారు. అధికారులు కుమ్మక్కు కాకపోతే సీఎంఆర్‌ అప్పగించని రైస్‌మిల్లర్లు, ధాన్యం స్వీకరించని గోదాం నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొనుగోలు కేంద్రం నుంచి గోదాం వరకు, వడ్లగింజ బియ్యంగా మారే ప్రతీ దశలో అవినీతి, అక్రమాలు, దోపిడీ జరుగుతున్నాయని అరోపించారు. ఎఫ్‌సీఐ నిధులను దుర్వినియోగం చేసి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను కేంద్ర ప్రభుత్వంతోపాటు ఈడీ, సీబీఐలకు అందజేస్తానని తెలిపారు. దోషులకు శిక్ష పడే వరకూ వెనక్కి తగ్గబోనని, ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా రైతుల కోసం చివరి వరకూ పోరాడుతానన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సౌదరి మహేందర్‌ యాదవ్‌, కాసగోని నిర్మల, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రఫీక్‌, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అరుణ్‌ రంజా, జిల్లా,నియోజకవర్గ నాయకులు పెరుక రమేష్‌, కొల్లూరి సంతోష్‌, మెండే శంకరయ్య, బండారి లత,రాజేందర్‌రెడ్డి, ఆన్వేష్‌, శేఖర్‌ మాస్టర్‌, రాజిరెడ్డి, మారం రమేష్‌, గుడ్ల వెంకటేశ్‌, శంకర్‌, వెంకటేశ్‌, వీరగోని కిరణ్‌, చందూ, కొత్తూరి సంపత్‌, సురేష్‌, హరీష్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు,

Updated Date - Jul 28 , 2026 | 11:42 PM