Share News

సింగరేణిలో రూ. ఆరు వేల కోట్ల కుంభకోణం

ABN , Publish Date - Jan 25 , 2026 | 11:49 PM

సింగరేణిలో రూ. ఆరు వేల కోట్ల కుంభకోణం జరిగిందని, నష్టాల్లో ఉన్న సింగరేణిని కేసీఆర్‌ లాభాల బాటలోకి తీసుకువస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం సింగరేణిని నష్టాల్లోకి నెట్టిందని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. ఆదివారం గోదావరిఖని చౌరస్తాలోని టీబీజీకేఎస్‌ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సింగరేణిలో రూ. ఆరు వేల కోట్ల కుంభకోణం

గోదావరిఖని, జనవరి 25(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో రూ. ఆరు వేల కోట్ల కుంభకోణం జరిగిందని, నష్టాల్లో ఉన్న సింగరేణిని కేసీఆర్‌ లాభాల బాటలోకి తీసుకువస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం సింగరేణిని నష్టాల్లోకి నెట్టిందని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. ఆదివారం గోదావరిఖని చౌరస్తాలోని టీబీజీకేఎస్‌ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2025 జనవరిలో భూపాలపల్లి టెండర్‌కు సైట్‌ విజిట్‌ షరతు లేకుండానే రివర్స్‌ టెండర్‌ ద్వారా అంచనా రేట్ల కంటే ఏడు శాతం తక్కువకు పనులు అప్పగించారన్నారు. మూడు నెలల్లోనే కొత్తగూడెం వీకే ఓసీ టెండర్‌కు సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ షరతు పెట్టారని, దీంతో పోటీ తగ్గిపోయి అంచనా రేట్ల కంటే ఎక్కువ రేట్లకు సృజన్‌రెడ్డి కంపెనీకి కాంట్రాక్టు అప్పగించారన్నారు. ఓబీ తొలగింపు కాంట్రాక్టర్లు సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ పెట్టడం వల్ల మొట్టమొదట లబ్ధి పొందింది ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌రెడ్డి అని అన్నారు. 2018 నుంచి 2024వరకు ఓబీ వర్క్‌లకు పిలిచిన టెండర్లలో సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ ఉందా, ఉంటే వాటిని బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా సింగరేణి స్కాంపై చర్చ జరుగుతుంటే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రిని, ఆయన బావమరిదిని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ పాలనలో 10 నుంచి 20 శాతం తక్కువకు టెండర్లు ఇస్తే కాంగ్రెస్‌ పాలనలో 10 శాతం అధికంగా ఇచ్చి కాంట్రాక్టులు అప్పగిస్తున్నారన్నారు. బొగ్గు కుంభకోణంపై మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని, ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. మంత్రుల మధ్య వాటాల పంపిణీలో జరిగిన విభేదాలతోనే కుంభకోణాలు బయటకు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కాపాడడానికి మంత్రి కిషన్‌రెడ్డి పాకులాడుతున్నాడని, నైనీ బ్లాక్‌, గతంలో వేసిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు మూల విజయారెడ్డి, కౌశిక హరి, నడిపెల్లి మురళీధర్‌రావు, గోపు ఐలయ్య, బాదె అంజలి, సంధ్యారెడ్డి, రమ్యయాదవ్‌, గుంపుల లక్ష్మి, పాలడుగుల కనకయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 11:49 PM