Share News

రైతుల ఇళ్లలో వరి సిరులు

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:39 AM

వానాకాలం సాగు రైతన్నలకు సిరులు కురిపిస్తున్నది. ప్రభుత్వం సన్న వరి రకాలనే సాగు చేయాలని సూచిస్తూ ఏడు సన్న రకం ధాన్యాలకు క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్‌ను ఇస్తామని ప్రకటించింది. దీంతో రైతులు ముందెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సన్న వరి రకాలను సాగు చేశారు.

రైతుల ఇళ్లలో వరి సిరులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

వానాకాలం సాగు రైతన్నలకు సిరులు కురిపిస్తున్నది. ప్రభుత్వం సన్న వరి రకాలనే సాగు చేయాలని సూచిస్తూ ఏడు సన్న రకం ధాన్యాలకు క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్‌ను ఇస్తామని ప్రకటించింది. దీంతో రైతులు ముందెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సన్న వరి రకాలను సాగు చేశారు. ఊహించని విధంగా ఎల్‌నినో యాసంగిలో వరి సాగును లేకుండా చేయడంతో వానాకాలం పంటకు డిమాండ్‌ పెరిగింది. రాబోయే రోజుల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటాయని, బియ్యం ధరలు ఆకాశాన్ని అంటే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుండడంతో సన్న రకం జై శ్రీరామ్‌ బియ్యానికి ఇప్పటికే కిలో వంద రూపాయల ధర పలుకుతోంది.

పొలాల వద్దకే వ్యాపారులు, రైస్‌ మిల్లర్లు

వరి కోతలు వారం పది రోజుల క్రితం ప్రారంభమై ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. దీంతో వ్యాపారులు, రైస్‌ మిల్లర్లు పొలాల వద్దకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. గతంలో కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తేమ ఎక్కువగా ఉండటంతో కేంద్రాల్లో ఎండబెట్టుకునే పరిస్థితి ఉండేది. వారం రోజులైనా ధాన్యాన్ని పట్టించుకోకపోయేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. వ్యాపారులు కల్లాల వద్దకే వెళ్ళి పచ్చి ధాన్యాన్నే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే, బోనస్‌ ధర కంటే ఎక్కువే చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఆయా వరి రకాలకు పలుకుతున్న ధరలు, వస్తున్న దిగుబడి అంచనాలను పరిగణలోకి తీసుకుంటే రెడు వేల నుంచి 2,200 కోట్ల విలువ చేసే పంట మార్కెట్‌ రానున్నట్లు అర్థమవుతోంది. అనూహ్యంగా కష్టపెడుతున్న కరువు పరిస్థితే కొంత లాభం కలిగించి నష్టాలను పూడ్చేదిగా మారడం రైతులను ఊపిరిపీల్చుకునేలా చేస్తున్నది.

వానాకాలంలో 2,65,734 ఎకరాల్లో వరి సాగు

జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 2,65,734 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో ప్రభుత్వం బోనస్‌ ప్రకటించిన ఏడు రకాల సన్న వరి రకాలు 1,79,671 ఎకరాలు కాగా 53,400 ఎకరాల్లో ఏ గ్రేడ్‌, 32,637 ఎకరాల్లో కామన్‌ వెరైటీ వరి రకాలను సాగు చేశారు. వ్యవసాయశాఖ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఎకరాకు 23 నుంచి 24 క్వింటాళ్ల వరకు దిగుబడిని అంచనా వేసింది. 4,15,128 టన్నుల సన్న రకాలు, 79,961 టన్నుల కామన్‌ ధాన్యం, 1,30,894 మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సన్న రకాలకు క్వింటాల్‌కు 2,461 రూపాయల మద్దతు ధర ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్‌ను ప్రకటించింది. దీనితో సన్న రకాలకు 2,961 రూపాయల ధర నిర్ణయించారు. ఏ గ్రేడ్‌ రకాలకు కూడా 2,461 చెల్లిస్తుండగా కామన్‌ దొడ్డు రకాలకు క్వింటాల్‌కు 2,441 రూపాయలు మద్దతు ధరగా ఇస్తున్నారు. యాసంగిలో వరి సాగు లేనందువల్ల బియ్యం ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన కస్టమ్‌ మిల్లింగ్‌ వడ్లను బియ్యంగా మార్చి ప్రైవేట్‌ మార్కెట్‌లో విక్రయించుకోవడం, వాటి రికవరీకి ప్రభుత్వం వారిపై ఒత్తిడి పెంచుతున్నంది. ఇది కూడా ఈ సీజన్‌లో పండిన వరి ధాన్యానికి డిమాండ్‌ పెంచింది.

జిల్లాకు ఇతర ప్రాంతాల వ్యాపారులు

ప్రస్తుతం స్థానిక వ్యాపారులే కాకుండా హైదరాబాద్‌, మిర్యాల గూడ, సిద్దిపేట, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యాపారులు, మిల్లర్లు జిల్లాకు వచ్చి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. స్థానిక వ్యాపారులతో కొందరు ఈమేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక ముందే వ్యాపారులు గ్రామాలకు వెళ్లి కోతలు చేపట్టిన రైతులను కలిసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కూనారం-1638, బీపీటీ రకానికి క్వింటాల్‌కు 3,100 నుంచి 3,300 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. జైశ్రీరామ్‌ ధాన్యానికి క్వింటాల్‌కు 4,100 నుంచి 4,500 రూపాయలు ఇస్తున్నారు. ఆర్‌ఎన్‌ఆర్‌గా పిలిచే తెలంగాణ సోన రకానికి కూడా మంచి డిమాండ్‌ వస్తున్నది. జైశ్రీరామ్‌ తర్వాత దీనికి క్వింటాల్‌కు 4,000 రూపాయలు ధర పలుకుతోంది. షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఈ బియ్యం మంచివనే ప్రచారం ఉండడంతో వీటిని ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దొడ్డురకం ధాన్యానికి 2800, 2900 చెల్లించి కొనుగోలుచేయడానికి వ్యాపారులు సంసిద్దత వ్యక్తం చేస్తుండడంతో రైతులు వారికే వాటిని విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. మరో 10, 15 రోజుల్లో వరి కోతలు ముమ్మరమై ధాన్యం అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

జిల్లాలో అంచనాలు

జిల్లాలో 60,526 ఎకరాల్లో బీపీటీ, 14,433 ఎకరాల్లో తెలంగాణ సోన, 78,871 ఎకరాల్లో కెఎన్‌ఎం 1638, 13,847 ఎకరాల్లో జై శ్రీరామ్‌, 6,407 ఎకరాల్లో కెఎన్‌ఎం-7715, హెచ్‌ఎంటీ సోన 5,391 ఎకరాల్లో, వరంగల్‌-44 రకం 196 ఎకరాల్లో సాగుచేశారు. జైశ్రీరామ్‌ 33,233 మెట్రిక్‌ టన్నులు, తెలంగాణ సోన ఆర్‌ఎన్‌ఆర్‌ 31,031 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. సన్న వరి రకాల్లో అత్యధికులు తినే కూనారం సన్నాలు కెఎన్‌ఎం-1638 రకం 1,85,347 టన్నులు, బీపీటీ 1,39,210 టన్నులు దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కేఎన్‌ఎం-7715 రకం 13,775 మెట్రిక్‌ టన్నులు, హెచ్‌ఎంటీ సోన 12,130 టన్నులు, వరంగల్‌ -44 రకం 402 టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వ అంచనా మేరకు 4,15,128 మెట్రిక్‌ టన్నుల సన్న రకాలకు సగటున 3100 రూపాయలు చొప్పున వేసుకున్నా రైతులకు 1,286 కోట్ల రూపాయలు, 2.1 లక్షల మెట్రిక్‌ టన్నుల ఏ-గ్రేడ్‌ దొడ్డు రకం ధాన్యానికి క్వింటాల్‌కు 2,900 చొప్పున 609 కోట్ల ఆదాయం రానున్నది. ఇప్పటి వరకు కోతలు పూర్తయిన పొలాల్లో వచ్చిన దిగుబడి ప్రకారం అంచనా వేసినా ఎకరాకు 27 క్వింటాళ్ల చొప్పున 4,85,117 మెట్రిక్‌ టన్నుల సన్న రకాల వరి ధాన్యం దిగుబడిగా వచ్చే అవకాశమున్నది. 3,100 రూపాయల కనీస ధరను వేసుకున్నా రైతులకు 1,503 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనున్నది. దొడ్డు వరి ధాన్యానికి మరో 600 నుంచి 650 కోట్లు, సుమారు 2,100 నుంచి 2,200 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

------------------

Updated Date - Oct 25 , 2026 | 12:39 AM