ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో సగానికి పడిపోయిన ఉత్పత్తి
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:04 AM
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)లో యూరియా ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) ఎల్‌ఎన్‌జీ సరఫరాను తగ్గించడంతో ప్రస్తుతం ప్లాంట్‌ను 50శాతం సామర్థ్యంతోనే నడుపుతున్నారు.
కోల్‌సిటీ, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)లో యూరియా ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) ఎల్‌ఎన్‌జీ సరఫరాను తగ్గించడంతో ప్రస్తుతం ప్లాంట్‌ను 50శాతం సామర్థ్యంతోనే నడుపుతున్నారు. రోజుకు 3850టన్నుల యూరియా ఉత్పత్తి జరుగాల్సి ఉండగా 1600 నుంచి 1900టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతున్నది. పరిశ్రమలో స్టాక్ లేకపోవడంతో సరఫరాను యాజమాన్యం నిలిపివేసింది. పరిశ్రమ నుంచి రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలకు యూరియా సరఫరా నిలిచిపోయింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో యూరియా ఉత్పత్తికి, 33మెగావాట్ల క్యాప్టివ్ పవర్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 2మెట్రిక్ మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం ఉంటుంది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఖతార్ నుంచి ఎల్‌ఎన్‌జీ దిగుమతి కాకపోవడంతో యూరియా సరఫరాను సగానికి తగ్గించింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ప్రస్తుతం 50శాతం సామర్థ్యంతో పరిశ్రమను నడుపుతోంది. ఇప్పటికే హెచ్‌టీఆర్ వైఫల్యంతో 110రోజులకు పైగా ప్లాంట్ షట్‌డౌన్ అయ్యింది. ఇప్పుడు సామర్థాన్ని ఏకంగా 50శాతానికి తగ్గించడం ద్వారా సాంకేతిక సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. మరో వైపు గెయిల్ ఎల్‌ఎన్‌జీ సరఫరాను మరింత తగ్గిస్తే ప్లాంట్ పూర్తిగా షట్‌డౌన్ అయ్యే అవకాశాలున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ప్లాంట్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి తగ్గించడంపై ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యాన్ని ఆరా తీస్తున్నాయి. 5వ తేదిన 15శాతం ఉత్పత్తిని తగ్గించిన యాజమాన్యం 6వ తేది సాయంత్రం వరకే 50శాతం తగ్గించడంతో రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. దీనికి తోడు పరిశ్రమ నుంచి రాష్ట్రానికి యూరియా సరఫరా నిలిపివేయడంతో ప్రభుత్వం ఈ పరిణామాలపై ఆరా తీస్తుంది. ఇప్పటికే విదేశాల నుంచి యూనియా దిగుమతి నిలిచిపోవడం, రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న ప్లాంట్ నుంచి సరఫరా ఆగిపోవడంతో రాష్ట్రం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టినట్టు సమాచారం.