భూముల సమస్య శాశ్వత పరిష్కారానికే రీసర్వే
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:14 AM
భూ సమస్యలకు శాశ్వత పరిష్కా రం చూపడంతోపాటు భూ భారతి సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యలకు శాశ్వత పరిష్కా రం చూపడంతోపాటు భూ భారతి సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లా డారు. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యమన్నారు. భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు చేరలేకపోయామని తెలిపారు. ధరణిలో పెండింగ్‌లో ఉన్న 9.6 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు భూభారతిలో అవకాశం కల్పించి, హైకోర్టు సమస్యలను పరిష్కరించినప్పటికీ అధిక సంఖ్యలో దరఖాస్తులు తిరస్క రణకు గురవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. భూసర్వే కోసం శిక్షణ పొందిన 5,700 మంది లైసెన్స్ సర్వేయర్ల సేవలను విని యోగించుకోవాలని, లైసెన్స్ సర్వేయర్లకు ఉద్యోగం లేదా రెగ్యులరైజేషన్ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తొలి విడతలో ప్రతీ జిల్లాలో 70 గ్రామా లను ఎంపిక చేసి రీ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్లు భూ రీ సర్వేను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల 28లోపు విధుల్లో చేరని లైసెన్స్ సర్వేయర్ల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డిఎస్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో భూ రీ సర్వేను నవంబర్‌లోపు పూర్తి చేయాలని, రెండో విడతలో మరో 70 గ్రామాల్లో 2027 మార్చిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారి రాజేశ్వరి, రెవెన్యూ డివిజనల్ అధికారి బి గంగయ్య, సురేష్ పాల్గొన్నారు.