నివాసం మూడో వార్డులో ఓట్లు 15వ వార్డులో
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:09 AM
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులకు చెందిన ఓటర్ల ఓట్లు వారు నివాసం ఉండే వార్డుల్లో కాకుండా ఇతర వార్డులకు మారాయి. మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పదిహేను వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించి నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించారు.
సుల్తానాబాద్, జనవరి 3(ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులకు చెందిన ఓటర్ల ఓట్లు వారు నివాసం ఉండే వార్డుల్లో కాకుండా ఇతర వార్డులకు మారాయి. మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పదిహేను వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించి నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించారు. జాబితాలో ఏవైన తప్పులు దొర్లితే అభ్యంతరాలను తెలుపాలని అధికారులు ప్రకటించారు. తాము ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వార్డుల్లో కాకుండా వేరే వార్డుకు మార్చారని ఓటర్లు పేర్కొంటున్నారు. తమ అభ్యంతరాలను ధరఖాస్తు రూపంగా శనివారం పలువురు ఓటర్లు మున్సిపల్ కమిషనర్ రమేష్‌కు సమర్పించారు. మూడో వార్డుకు సంబంధించి దాదాపు అరవై మంది ఓటర్ల పేర్లను 15వ వార్డులో చేర్చారని వారన్నారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించి తమ పేర్లను ఎప్పటిలాగా మూడో వార్డులోనే ఉంచాలని కోరుతున్నారు.
విచారణ జరిపి పరిష్కరిస్తాం
- కమిషనర్ రమేష్
ఓటర్ల అభ్యంతరాల దరఖాస్తులను స్వీకరించాం. అధికారులతో విచారణ జరిపిస్తాం. నివేదికను కలెక్టర్‌కు, ఆర్డీవోకు సమర్పించి వారి సూచనల మేరకు మారుస్తాం. ప్రస్తుత నియమ నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని, కొత్తగా ఓటర్ల నమోదు చేయడం, జాబితాలో చేర్చడం, అలాగే జాబితా నుంచి ఎవరివైనా తొలగించడం వంటివి ఉండవు. కేవలం అభ్యంతరాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం.