మతపరమైన ఆంక్షలను తొలగించాలి
ABN , Publish Date - May 09 , 2026 | 11:38 PM
మతపరమైన ఆంక్షలు తొలగించి ఎస్సీలకు సంపూర్ణ మత స్వేచ్ఛ కల్పించాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నతానియేల్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని బేతేలు చర్చిలో దళిత కైస్త్రవులు హక్కుల సాధనకు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి): మతపరమైన ఆంక్షలు తొలగించి ఎస్సీలకు సంపూర్ణ మత స్వేచ్ఛ కల్పించాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నతానియేల్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని బేతేలు చర్చిలో దళిత కైస్త్రవులు హక్కుల సాధనకు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన ఎస్సీ హోదాను రద్దు చేయడం న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. మతం మారినంత మాత్రాన వారిని ఎస్సీ జాబితా నుంచి తొలగించడం ప్రాథమిక హక్కులను కాలరాయడమే కాక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఎస్సీలు ఏ మతం ఆచరించినా వారికి ఎస్సీ హోదా కోల్పోకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 17, 21, 25 ప్రకారం అందరికీ సమాన హక్కులు లభించేలా షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ 1950లోని మతప రమైన ఆంక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఓసీ, బీసీ, ఎస్టీలకు ఏ విధమైన సమాన హక్కులు ఉన్నాయో ఎస్సీలకు కూడా అవే హక్కులు ఉండాలని డిమాండ్ చేశారు. ఈనెల 13న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించే దళిత కైస్త్రవ శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ జరుగుతుందన్నారు. యునైటెడ్ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు రెవరెండ్ యు సుధాకర్, రెవరెండ్ వాసాల డేవిడ్, కీర్తి కుమార్, అంకరి కుమార్, మహిపాల్ రెడ్డి, అశోక్ కుమార్, పల్లె శాంతి రాజు, కె ఆర్ డిక్, ఎం జోసఫ్, అశోక్ కుమార్, ఫోక్ సింగర్ గొంగళ్ళ సునీల్, ఇంజం డేవిడ్, షెడ్రక్, వి డ్యానియెల్ మోజెస్ పాల్గొన్నారు.