అన్నదాతలకు ఊరట
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:45 AM
జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈయేడు వానాకాలం సీజన్‌లో వర్షాలు సరిగా కురవలేదు. అడపాదడపా కురిసిన వర్షాలతో రైతులు సాగు చేశారు. అనంతరం సరైన వర్షాలు కురవకపోవడంతో కళ్ళ ముందు బీటలు వారుతున్న పొలాలను చూసిన రైతులు మనోవేదనకు గురయ్యారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈయేడు వానాకాలం సీజన్‌లో వర్షాలు సరిగా కురవలేదు. అడపాదడపా కురిసిన వర్షాలతో రైతులు సాగు చేశారు. అనంతరం సరైన వర్షాలు కురవకపోవడంతో కళ్ళ ముందు బీటలు వారుతున్న పొలాలను చూసిన రైతులు మనోవేదనకు గురయ్యారు. ఇక పంటలను కోల్పోవల్సిందేనంటూ నిర్వేదానికి లోనయ్యారు. పంటలపై ఆందోళన చెందుతున్న క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం ప్రభావంతో వర్షాలు కురిసాయి. దీంతో పంటలకు ప్రాణం పోశాయని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వానాకాలం సీజన్‌లో వర్షాలు తగ్గుతాయని ఆందోళన మధ్య జిల్లా రైతులకు వర్షాలు ఊరగనిచ్చాఇయ. ఈ నెల 22 నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలతో ఎండిపోతున్న పంటలకు సాగు నీరు అందడంతో పాటు కుంటలు, చెరువుల్లోకి కొత్త నీరు చేరుతోంది. ఈనెల 23, 24, 25 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మూడు రోజులు గా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. కూనారంలో 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
2.68 లక్షల ఎకరాల్లో పంటలు
జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2లక్షల 67వేల 810 ఎకరాల్లో వివిధ పం టలు సాగయ్యాయని వ్యవసాయశాఖ అధికారుల లెక్కలు పేర్కొం టున్నాయి. ఇందులో ప్రధానంగా 2 లక్షల 15 వేల 301 ఎకరాల్లో వరి, 51 వేల 426 ఎకరాల్లో పత్తి సాగులో ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే వరి, పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ సీజన్ ప్రారంభంలో వ్యవసాయశాఖ అంచనా ప్రకారం 2లక్షల 78వేల 293 ఎకరాల్లో పంటలు సాగు చేయాలని ప్రణాళిక రూపొందించారు. అందులో వరి 2లక్షల 15 వేల 500 ఎకరాలు, పత్తి 52 వేల 094ఎకరాలు, మొక్కజొన్న 886, కంది 208, పెసర 10, మినుములు 11, నువ్వులు 44, ఆయిల్‌పామ్ 3,179, మిర్చి 133, పసుపు 295, ఇతర పప్పుదినుసులు 376, కూరగాయలు 5,128 ఎకరాలుగా అంచనా వేశారు.
చేతికొచ్చే దశలో వరి
ప్రస్తుతం జిల్లాలో అనేక ప్రాంతాల్లో వరి పంట కీలక దశకు చేరుకుంది. కొన్ని చోట్ల పొట్ట దశలో ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో కంకులు వస్తు న్నాయి. ఈ సమయంలో పొలంలో తగినంత తేమ ఉండటం అవసరం. తాజాగా కురిసిన వర్షాలు వరి పంటకు మేలు చేశాయని రైతులు చెబుతున్నారు. మరో పదిహేను రోజుల తర్వాత రెండు మంచి వర్షాలు కురిస్తే పంటలు చేతికి వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని రైతులు ఆశిస్తున్నారు.
చెరువులు, కుంటలకు జలకళ
జిల్లాలోని అనేక చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు చేరుతోంది. ఇప్పటికే సాగునీటి అవసరాల కోసం బోర్లు, కాలువలపై ఆధారపడుతున్న రైతులకు వర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. గతంలో నీటి లభ్యతపై ఆం దోళన వ్యక్తమైనప్పటికీ వరుస వర్షాలతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది.
వర్షపాతం ఇలా...
పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్ళపెల్లిలో 28.5 మిల్లీమీటర్లు, ముత్తారం మండల కేంద్రంలో 26.0 మిల్లీమీటర్లు, ధర్మారం మండల కేంద్రంలో 22.8 మిల్లీమీటర్లు, రామగిరి మండలం ముల్కాలపల్లి 21.3 మిల్లీమీటర్లు, అంతర్గాం మండలం ఆకెనపల్లిలో 17.2, ఎలిగేడు మండల కేంద్రంలో 16.5, రామగుండం మండలం మల్యాలపల్లి 16.3, రామగిరి మండలం కల్వచర్ల 14.8, కమాన్‌పూర్ మండల కేంద్రం 12.5, పెద్దపల్లి మండలం రంగంపల్లి 12.0, రామగుండం 11.5, సుల్తానాబాద్ మండలం కనుకుల 11.2, జూలపల్లి, మంథని మండలం ఎగ్లాస్‌పూర్ 10.0, సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి 9.0, యైుటింక్లయిన్ కాలనీ 8.3, కాల్వశ్రీరాంపూర్ 7.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.