అన్నదాతకు ఊరట
ABN , Publish Date - May 03 , 2026 | 12:22 AM
ఈయేడాది పంట రుణ పరిమితిని ప్రభుత్వం పెంచింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) సిఫార్సుల మేరకు ఈ పెంపు ఉంటుంది. ప్రధానంగా రైతులకు ఏటా సాగులో పెట్టుబడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రుణ పరిమితి పెంపు ద్వారా అన్నదాతకు బ్యాంకు లభించే రుణం పెరగనుంది.
జగిత్యాల, మే 2 (ఆంధ్రజ్యోతి): ఈయేడాది పంట రుణ పరిమితిని ప్రభుత్వం పెంచింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) సిఫార్సుల మేరకు ఈ పెంపు ఉంటుంది. ప్రధానంగా రైతులకు ఏటా సాగులో పెట్టుబడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రుణ పరిమితి పెంపు ద్వారా అన్నదాతకు బ్యాంకు లభించే రుణం పెరగనుంది. జిల్లాలో ఈయేడాది సుమారు 4.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో 2,48,550 మంది రైతులు ఉన్నారు. ఇందులో 2.5 ఎకరాల్లోపు 1,79,826 మంది రైతులు, 2.5 నుంచి 5 ఎకరాల్లో 52,692 మంది రైతులు, 5 ఎకరాల పైన 16,032 మంది రైతులున్నారు.
జిల్లాలో వానాకాలం సాగు అంచనా ఇలా..
జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 4,50,169 ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా వరి 3,50,642 ఎకరాలు, మొక్కజొన్న 32 వేల ఎకరాలు, కందులు 1,500 ఎకరాలు, పత్తి 18 వేల ఎకరాలు, చెరుకు 500 ఎకరాలు, పసుపు 8,500 ఎకరాలు, మిరప 500 ఎకరాలు, మామిడి 38,277 ఎకరాలు, వివిధ కూరగాయలు 400 ఎకరాలు, ఆయిల్ ఫామ్ 3,750 ఎకరాల్లో సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ఫవరి, మొక్కజొన్న, పత్తి రైతుకు మేలు..
జిల్లాలో అత్యధికంగా సాగయ్యే వరి, మొక్కజొన్న, పత్తికి సంబంధించి పంట రుణ పరిమితి పెంచడం ద్వారా రైతులు చేకూరనుంది. ఎకరానికి నిర్ధారిత మొత్తం బ్యాంకర్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా సాగులో వారికి పెట్టుబడి భారం ఉపయుక్తంగా ఉంటుంది. వరి, పత్తి, మొక్క జొన్న పంటలకు రుణ పరిమితిని రూ. 2 వేల వరకు పెంచారు.
బ్యాంకులు ఆదరించేలా..
ఈ యేడాది సుమారు రెండు లక్షలకు పైగా మంది రైతుల అకౌంట్లకు రుణాలు అందజేయాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నదాతలకు విరివిగా రుణాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతుల ఆర్థిక పరిస్థితులతో రుణం కట్టలేని పరిస్థితిలో ఉండగా, బ్యాంకర్లు దాన్ని మరోవిధంగా తమకు ఉప యుక్తంగా మార్చుకుంటున్నారు. పాత రుణాన్ని రెన్యూవల్ చేస్తున్నట్లు చేసే బ్యాంకర్లు రుణ పరిమితి ఆధారంగా పెంచిన మొత్తాన్ని రైతుల చేతికి ఇచ్చి మిగితా మొత్తం పాత బకాయిగా సర్దుబాటు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సద్వినియోగం చేసుకోవాలి
-భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
ప్రభుత్వం పెంచిన రుణ పరిమితిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. బ్యాంకర్లు రైతులకు విరివిగా పంట రుణాలు అందించాలి. పెంచిన రుణ పరిమితి ఆధారంగా పంపిణీ చేయాలి. ప్రభుత్వ లక్ష్యాన్ని అన్ని వర్గాలు నెరవేర్చాలి.
-----------------------
పంటల వారీగా రుణ పరిమితి
-----------------------------
పంట - 2025-26లో (రూ.వేలల్లో) - 2026-27లో (రూ.వేలల్లో)
వరి - 46 - 48
వరి సీడ్ - 50 - 51
జొన్న - 21 - 22
జోన్న సీడ్ - 26 - 26
పత్తి - 48 - 50
మొక్కజొన్న - 36 - 38
సజ్జ - 18 - 19
కంది - 25 - 27
పప్పుశనగ - 27 - 28
వేరు శనగ - 32 - 34
ఆముదం 21 - 22
---------------------------------------------------------------------
పండ్ల తోటలు ఎకరాకు..(రూ వేలల్లో)
రకం - 2025-26 - 2026-27
మామిడి - 47 - 50
పప్పాయి - 69 - 70
కలంగడి - 36 - 38
జామ - 49 - 51
బత్తాయి - 47 - 50
నిమ్మ - 52 - 53
దానిమ్మ - 78 - 79
-------------------------------------------------------
కూరగాయలు ఎకరాకు...(రూ. వేలల్లో)
రకం - 2025-26 - 2026-27
ఎండుమిర్చి - 86 - 90
టమాట - 57 - 58
వంకాయ- 42 - 43
ఉల్లి - 47 -49
బెండ - 32 - 33
క్యాబేజీ - 35 - 36
క్యాలిప్లవర్ - 35 -36
మునగ - 36 - 40
క్యాప్సికమ్ - 52 - 53
ఆకు కూరలు - 25 -26