Share News

పంచాయతీలకు ఊరట..

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:08 AM

గ్రామ పంచాయతీల సొంత నిధుల వాడకంపై ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి పంచాయతీల కుస్వయం ప్రతిపత్తిని కల్పించడంతో సర్పంచులు, వార్డు సభ్యులు, పం చాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీలకు ఊరట..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

గ్రామ పంచాయతీల సొంత నిధుల వాడకంపై ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి పంచాయతీల కుస్వయం ప్రతిపత్తిని కల్పించడంతో సర్పంచులు, వార్డు సభ్యులు, పం చాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిధుల కోసం ట్రెజరరీపై ఆధారపడాల్సిన అవసరం లేకపోగా, పంచాయతీకి పన్నుల రూపేణా వచ్చే ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి వెచ్చించుకునే వెసలుబాటు కలగనున్నది. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీల సొంత నిధుల వాడకంపై పరిమితులు విధించింది. గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు పంచాయతీ పాలకవర్గాలు తంటాలు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాకపోవడమే గాకుండా సొంతంగా సమకూర్చుకున్న నిధులపై ప్రభుత్వ ఆధిపత్యం ఉండేలా గత ప్రభుత్వ హయాంలో తీసుకవచ్చిన పంచాయతీరాజ్‌ చట్టం- 2018లోని సెక్షన్‌ 70(3)ను సవరించాలని శుక్ర వారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకు న్నారు. ఇక నుంచి పంచాయతీకి పన్నుల రూపేణా వచ్చే డబ్బులను జమ చేసేందుకు జాతీయ బ్యాంకులో గానీ, సహకార బ్యాంకులో గానీ ఖాతా తీసుకునే విధంగా చట్ట సవరణ చేశారు. నిబంధనలను అనుసరించి ఆ నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. ఈనెల 17వ తేదీన ఆంధ్రజ్యోతి మెయిన్‌ ఎడిషన్‌లో ‘పంచాయతీల్లో ఫ్రీజింగ్‌ పంచాయితీ’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.

పన్నుల రూపేణా నిధులు జమ..

పంచాయతీల నిర్వహణ కోసం యేటా ప్రజల నుంచి పన్నుల రూపేణా ఇంటిపన్ను, నల్లా నీటి పన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌ల ద్వారా వచ్చే ఫీజులు, భవన నిర్మాణ అనుమతి రుసుములు, అంగళ్ల వేలం, ఇతరత్రా వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఈ నిధులను జనరల్‌ ఫండ్‌ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ నిధులతో పంచాయతీల నిర్వహణతో పాటు గ్రామాల్లో అభి వృద్ధి పనుల కోసం పంచాయతీ పాలకవర్గాలు వెచ్చిస్తుంటాయి. అయితే వీటిని వినియోగించేందుకు రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం లేదు. దీనికి గత ప్రభుత్వ హయాంలో తీసుకవచ్చిన పంచాయతీరాజ్‌ చట్టం- 2018 కారణమని చెబుతున్నారు. పంచాయతీలకు వచ్చే ప్రతీ రూపాయిని ట్రెజరరీలో జమ చేయాలనే నిబంధన విధించారు. కానీ ఆ నిధులను స్వేచ్ఛగా గ్రామ అభివృద్ధికి సద్వినియోగం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఒక్కో పంచాయతీల్లో 5 నుంచి 50 లక్షల రూపాయల వరకు జమ కాగా, అవి ట్రెజరీల్లో కాగితాలకే పరిమితం అయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలను 2025 నవంబరు, డిసెంబరు మాసాల్లో నిర్వహించింది. కొత్తగా కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గాలు జనరల్‌ ఫండ్‌ బాగానే ఉన్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకునే వెసలుబాటు లేకపోవడంతో పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లారు. జనరల్‌ ఫండ్‌ విషయమై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు వచ్చాయి. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం జనరల్‌ ఫండ్‌ సద్వినియోగం ఉన్న అడ్డంకులను తొలగించే విధంగా ప్రభుత్వం చట్ట సవరణ చేయడంతో హర్షం వ్యక్తం అవుతున్నది. అలాగే రెండున్నరేళ్లుగా ట్రెజరరీల్లో మూలుగుతున్న నిధులను గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఖర్చు చేసేందుకు ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలని సర్పంచులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయం పంచాయతీలకు మేలు..

- చిలుక స్రవంతి, సర్పంచ్‌, తొగర్రాయి

గ్రామాల అభివృద్ధికి ప్రజలు ఇంటి పన్నులు, నల్లా పన్నులు, ఇతరత్రా చెల్లించే పన్నుల ద్వారా వచ్చే డబ్బును ప్రజల అవసరాల కోసం వెచ్చించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టం 2018కి చట్ట సవరణ చేయడం హర్షణీయం. గత ప్రభుత్వం ట్రెజరీల్లో డబ్బులు జమ చేయాలనే నిబంధన వల్ల పంచాయతీల్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. ట్రెజరీల్లో డబ్బులు ఉన్నాయని పనులు చేస్తే అవి వస్తాయా, లేదా అనే పరిస్థితి. ఇప్పుడు నేరుగా పంచాయతీ పేరిట బ్యాంకు ఖాతా తీసుకుని ఖర్చు చేసుకునే వెసలుబాటు కల్పించడం వల్ల పంచాయతీలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

సర్పంచ్‌లకు ఆర్థిక బాధలు తప్పాయి..

- ఆరె సంతోష్‌ కుమార్‌, సర్పంచ్‌, అప్పన్నపేట

గ్రామ పంచాయతీలో ఉండే నిధులను వినియోగించుకోవచ్చని కేబినెట్‌ ఆమోదం తెలుపడం చాలా సంతోషంగా ఉంది. గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధుల ఆధారంగా గ్రామాల్లో పనులు చేపట్టవచ్చు. ఉన్న నిధులతోనే చేపడుతామని భరోసా ఇవ్వడంతో సర్పంచ్‌లకు కొంతమేర ఆర్థిక భారం తప్పింది. ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చే 16వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడాల్సి వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గ్రామాల్లో ఇక అభివృద్ధి పనులు చకచకా నడవనున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం..

- రేండ్ల శారద, సర్పంచ్‌, కల్వచర్ల

గ్రామ పంచాయతీల జనరల్‌ ఫండ్‌ను వెచ్చించుకునేందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టం-2018కి సవరణ చేయడం హర్షణీయం. ట్రెజరీల్లో ఉండే ఈ నిధులను ఇప్పటి వరకు వెచ్చించేందుకు నానాతంటాలు పడ్డాం. సక్రమంగా బిల్లులు కాక పోవడంతో జనరల్‌ ఫండ్‌తో పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పుడు బ్యాంకులో ఖాతా తీసుకుని పంచాయతీ అవసరాల కోసం వెచ్చించే విధంగా చట్ట సవరణ చేయడం వల్ల ఇబ్బందులు తొలగనున్నాయి. అలాగే ట్రెజరీల్లో మూలుగుతున్న జనరల్‌ ఫండ్‌ను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

Updated Date - Jul 19 , 2026 | 12:08 AM