చిన్నారులకు ఉపశమనం
ABN , Publish Date - May 03 , 2026 | 12:12 AM
మండుతున్న ఎండలను చూసి ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు రావడం మరీ ఇబ్బంది. అందులోనూ చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో కూర్చోవాలంటే మరి ఇబ్బంది పడాల్సిందే.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మండుతున్న ఎండలను చూసి ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు రావడం మరీ ఇబ్బంది. అందులోనూ చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో కూర్చోవాలంటే మరి ఇబ్బంది పడాల్సిందే. మరోవైపు ఎండల తీవ్రతకు తల్లిదండ్రులు కూడా కేంద్రాలకు పంపించడం తగ్గించారు. గర్భిణులు, బాలింతలు కూడా రావడానికి ఇష్టపడని పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకు అంగన్‌వాడీ కేంద్రాలకు నెల రోజులు సెలవు ప్రకటించారు. దీంతో చిన్నారులకు ఉపశమనంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండల తీవ్రత 44 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ లాభక్తులకు అంగన్‌వాడీ సరుకులను ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేసింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కోడిగుడ్లు, బాలామృతం, పాలు, కురుకురే ప్యాకెట్లు లాంటివి అందించడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపిణీ జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 586 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా సిరిసిల్ల ప్రాజెక్టు పరిధిలో 362 కేంద్రాలు, వేములవాడ ప్రాజెక్టు పరిధిలో 224 కేంద్రాలు ఉన్నాయి. రెండు ప్రాజెక్టులు పరిధిలో 43 వేల మంది లాభోక్తులు ఉన్నారు. ఇందులో 6 సంవత్సరాలలోపు చిన్నారులు 3091 మంది, 7 నెలల నుంచి 3 సంవత్సరాల చిన్నారులు 16980 మంది, 3 నుంచి 6 సంవత్సరాల వరకు చిన్నారులు 17338 మంది ఉన్నారు. గర్భిణులు 3793 మంది, బాలింతలు 2430 ఉన్నారు. వీరికి ప్రతినెల పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆరోగ్య పరీక్షలపై అవగాహన కల్పించడంతోపాటు టీకాలు కూడా వేయిస్తున్నారు. నిరంతరంగా సాగుతున్న పోషకాహారం పంపిణీలో ఇబ్బందులు కలగకుండా వేసవి సెలవుల్లోనూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్నారు.
సరుకుల పంపిణీ ఇలా..
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఒక్కొక్కరికి రోజుకు 150 గ్రాములు బియ్యం, 30 గ్రాముల పప్పు, 16గ్రాముల నూనె, 200ఎంఎల్ పాలు అందిస్తున్నారు. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు బలామృతంతో పాటు 15 రోజులకు 8 చొప్పున నెలకు 16 గుడ్లు పంపిణీ చేస్తారు. మూడు నుంచి ఐదేళ్ల వయసులో పిల్లలకు ఒక్కొక్కరికి రోజుకు 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, ఐదు గ్రాముల నూనె, కురుకురే ప్యాకెట్లు అందిస్తారు. మే 31 వరకు నెలరోజుల సరుకులను అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు అందించనున్నారు.
బ్రేక్ ఫాస్ట్‌కు సన్నాహాలు
చిన్నారులకు ఆటపాటలతో ప్రీప్రైమరీ విద్యను అందించడంతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం తాజాగా చిన్నారులకు పౌష్టికాహార లోపాన్ని అధిగమించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లోని తొలి ముద్ద బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించారు. వేసవి సెలవుల తర్వాత అంగన్‌వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ప్రతిరోజు ఉడికించిన కోడిగుడ్డు, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇదే క్రమంలో చిన్నారులు ఉదయం వేళల్లో ఇళ్ల వద్ద ఏమి తినకుండానే అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్నవారు ఉన్నారు. వీరు మధ్యాహ్నం వరకు నీరసించి పోయే పరిస్థితి ఉండడంతో చిన్నారులకు తొలిముద్ద బ్రేక్‌ఫాస్ట్ పేరుతో పోషకాహారం అందించనున్నారు. బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో చిన్నారులకు ఉప్మా, కిచిడి అందిస్తారు. ప్రభుత్వమే పోషకాల మిశ్రమం కలిగిన సామగ్రి పంపించనుంది. చిన్నారుల ఎత్తు, మానసిక ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా విటమిన్లు, ప్రోటీన్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పేద కుటుంబాల చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సరుకుల పంపిణీ ఉత్తర్వులు వచ్చాయి..
- లక్ష్మీరాజం జిల్లా సంక్షేమ అధికారి
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇళ్లకు సరుకులు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 586 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 43 వేల మంది లాభోక్తులు ఉన్నారు. వారికి నెల రోజులకు సరిపడే సరుకులు పంపిణీ చేస్తాం.