Share News

దిగుబడుల్లో రికార్డు

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:36 AM

యాసంగి సీజన్‌లో కాలం కలిసి రావడంతో మంచి దిగుబడులు వచ్చాయి. కొనుగోలు కేంద్రాల ద్వారానే సుమారు రూ.2వేల కోట్లకు పైగా విలువైన పంట ఉత్పత్తులను సేకరించడం గమనార్హం. రైతులు బహిరంగ మార్కెట్‌లో మరో రూ.500 కోట్లకు పైగా విలువైన పంట ఉత్పత్తులను విక్రయించి ఉంటారన్న అంచనా ఉంది.

 దిగుబడుల్లో రికార్డు

జగిత్యాల, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌లో కాలం కలిసి రావడంతో మంచి దిగుబడులు వచ్చాయి. కొనుగోలు కేంద్రాల ద్వారానే సుమారు రూ.2వేల కోట్లకు పైగా విలువైన పంట ఉత్పత్తులను సేకరించడం గమనార్హం. రైతులు బహిరంగ మార్కెట్‌లో మరో రూ.500 కోట్లకు పైగా విలువైన పంట ఉత్పత్తులను విక్రయించి ఉంటారన్న అంచనా ఉంది. ఇందులో సుమారు రూ.1,300కోట్ల వరి ధాన్యం కొనుగోలు చేయగా, రూ.115 కోట్ల మొక్కజొన్న, రూ.300 కోట్ల మామిడి, రూ.300 కోట్ల పసుపు కొనుగోళ్లు జరిగాయని అంచనా ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలతో పాటు ప్రైవేటులో వ్యాపారులకు సైతం రైతులను పంట దిగుబడులను విక్రయించారు.

గత యేడాది భారీ వర్షాలు కురవడంతో సాగు నీటికి ఢోకా లేకుండా పోయింది. జిల్లాకు కల్పతరువుగా ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో నిండా నీళ్లు ఉండడంతో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. దీంతో ఆయకట్టు ప్రాంతాలతో పాటు బోర్ల కింద వానాకాలంతో పాటు యాసంగి పంటలు సాగయ్యాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పసుపు, మామిడి, నువ్వు తదితర పంటలు సాగు చేసిన రైతులు మంచి దిగుబడులు సాధించారు. యాసంగిలో పౌరసరఫరాలు, మార్క్‌ఫెడ్‌ సంస్థలు రూ.2 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులు కొనుగోలు చేశాయి.

పెరిగిన వరి దిగుబడి...

జిల్లాలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, రోళ్లవాగు, రాళ్లవాగు, గంగనాల, సదరం తదితర ప్రాజెక్టులతో పాటు సుమారు లక్ష బోర్లు, బావుల కింద వరి, ఇతర పంటలు సాగు చేశారు. భూగర్భ జలాలు పెరిగి బోర్లు ఇబ్బంది పెట్టకపోవడంతో యాసంగిలో వరి దిగుబడులు అంచనాకు మించి వచ్చాయి. శ్రీరాంసాగర్‌ ఆయకట్టు ప్రాంతాల్లో పంట దిగుబడి ఎక్కువగా వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో తెగుళ్లు, ఇతర సమస్యలతో దిగుబడి కొంత తగ్గినా మొత్తంగా పెరిగిందనే చెప్పుకోవాలి.జిల్లాలో యాసంగి వరి ధాన్యం సేకరణ చరిత్ర సృష్టించింది. యాసంగిలో జిల్లాలో రికార్డు స్థాయిలో 5 లక్షల మెట్రిక్‌ టన్నులకు మించి ధాన్యం సేకరించారు. తొలుత అంచనా 5.12 లక్షల మెట్రిక్‌ టన్నులను దాటుకొని, జిల్లా యంత్రాంగం రికార్డు స్థాయిలో 95,2367 మంది రైతుల వద్ద నుంచి రూ.1,296.86 కోట్ల విలువ గల దాదాపు 5,42,258 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 2025-26 యాసంగి సీజన్‌లో జిల్లాలో 2.97 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. యాసంగి సీజన్‌లో అనుకూల వాతావరణ పరిస్థితులతో జిల్లాలో ధాన్యం దిగుబడి పెరిగింది. ఫలితంగా ధాన్యం కొనుగోళ్ల పరంగా కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. 2024-25 యాసంగిలో 4.68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. గతం కంటే ఈసారి రూ.200 కోట్ల విలువైన సుమారు 74వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు కేంద్రాలకు రావడం గమనార్హం.

మక్కల దిగుబడి భళా..

యాసంగిలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డివిజన్‌లలోని పలు మండలాల్లో మొక్కజొన్న భారీగా సాగైంది. కొందరు రైతులకు ఎకరాకు రూ.45 క్వింటాళ్ల నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12 కేంద్రాల్లో రూ.115 కోట్ల విలువ గల 47,925 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నను 12,420 మంది రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోళ్లు చేసింది. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా ఎకరాకు 26.5 క్వింటాళ్ల చొప్పున రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించింది. దిగుబడి అధికంగా రావడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించడానికి ఆసక్తిని కనబరిచారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరవడం వల్ల సగానికి పైగా రైతులు దళారులు, వ్యాపారులకు కూడా పెద్ద మొత్తంలో మక్కలు విక్రయించారు.

మామిడిది అదే జోరు...

జిల్లాలో ఈ యేడాది మామిడి సాగు విస్తీర్ణం పెరిగింది. జగిత్యాల, గొల్లపల్లి, రాయికల్‌, పెగడపల్లి, ధర్మపురి, కథలాపూర్‌, మల్లాపూర్‌, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మేడిపల్లి, భీమారం తదితర ప్రాంతాల్లో మామిడి ఎక్కువగా సాగైంది. పంట చేతికి వచ్చిన తర్వాత జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి తదితర ప్రాంతాల్లో మామిడి కొనుగోలు కేంద్రాలు తెరవగా వ్యాపారుల మాయాజాలానికి గురై తక్కువ రేట్లకు మామిడిని విక్రయించాల్సి వచ్చిందన్న ఆరోపణలున్నాయి. కేవలం జగిత్యాల మామిడి మార్కెట్‌లో సుమారు రూ.40 కోట్ల విలువ గల 7,267 మంది రైతులకు చెందిన 1,42,616 క్వింటాళ్ల మామిడిని సేకరించగా సుమారు రూ.40 లక్షల మార్కెట్‌ ఫీజు రాబడి వచ్చిందని రికార్డులు తెలుపుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 250 నుంచి రూ. 300 కోట్ల మామిడి వ్యాపారం జరిగిందన్న అంచనా ఉంది.

అదే వరుసలో నువ్వు..

రాష్ట్రంలోనే నువ్వు సాగులో జిల్లా ముందు వరసలో ఉంది. జిల్లాలో పసుపు తర్వాత రెండో పంటగా నువ్వులను సాగు చేస్తున్నారు. జిల్లాలో ప్రతీ యేటా 12 వేల నుంచి 15 వేల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. సుమారు రూ.10 కోట్ల వరకు నువ్వు వ్యాపార లావాదేవీలు జరిగినట్లు అంచనా ఉంది. నువ్వుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.9,846గా ఉంది. ప్రభుత్వం నువ్వు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.9,700 నుంచి రూ. 10 వేల వరకు వ్యాపారులు చెల్లించారు.

జోరందుకున్న పసుపు...

దేశంలోనే అత్యధికంగా పసుపు పండించే రాష్ట్రాల సరసన తెలంగాణ ఉండగా, రాష్ట్రంలో సుమారు ముప్పాతిక శాతం నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలో పసుపు సాగు అవుతోంది. సుమారు 7.50 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాల నుంచే ఉంటోందని వ్యాపారులు అంటున్నారు. జిల్లాలో 40 వేల ఎకరాలలో పసుపును సాగు చేశారు. సుమారు లక్ష నుంచి 1.50 లక్షల దిగుబడి వస్తుందన్న అంచనా ఉంది. క్వింటాలు పసుపుకు రూ. 10 వేల నుంచి రూ. 14 వేల వరకు ధర పలికింది. ఈ లెక్కన సుమారు రూ.వంద కోట్ల వరకు వ్యాపారం జరిగిందన్న అంచనా ఉంది. జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, గొల్లపల్లి, రాయికల్‌ తదితర ప్రాంతాల్లోని మార్కెట్‌లలో అత్యధికంగా పసుపును రైతులు విక్రయించారు.

Updated Date - Jun 30 , 2026 | 12:36 AM