Share News

రేషన కష్టాలు

ABN , Publish Date - Aug 23 , 2026 | 01:00 AM

మూడు నెలలకు సంబంధించి జిల్లాలో జరుగుతున్న రేషన పంపిణీలో కార్డుదారులకు అవస్థలు ఎదురవుతున్నాయి. నిధానంగా తీసుకుందామని ఇన్నాళ్లు జాప్యం చేసిన కార్డుదారులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఓ వైపు నెలాఖరు నిర్ణీత గడువు ముగిసే సమయం సమీపిస్తుండడం.. మరోవైపు దుకాణాల్లో బియ్యం లేవని డీలర్లు చెబుతుండడంతో లబ్ధిదారులకు ఆందోళన చెందుతున్నారు.

రేషన కష్టాలు

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

మూడు నెలలకు సంబంధించి జిల్లాలో జరుగుతున్న రేషన పంపిణీలో కార్డుదారులకు అవస్థలు ఎదురవుతున్నాయి. నిధానంగా తీసుకుందామని ఇన్నాళ్లు జాప్యం చేసిన కార్డుదారులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఓ వైపు నెలాఖరు నిర్ణీత గడువు ముగిసే సమయం సమీపిస్తుండడం.. మరోవైపు దుకాణాల్లో బియ్యం లేవని డీలర్లు చెబుతుండడంతో లబ్ధిదారులకు ఆందోళన చెందుతున్నారు. చౌకధరల దుకాణాలకు సరిపడే విధంగా మండలస్థాయి నిల్వ కేంద్రం (ఎంఎల్‌ఎస్‌) నుంచి బియ్యాన్ని అవసరమైన మేరకు సరఫరా చేయకపోవడంతో ఈ సమస్య ముంచుకొచ్చింది. ఈనెల 31తో పంపిణీని నిలిపి వేయనున్నారు. దీంతో బియ్యం అందరికి అందుతాయా అన్న అనుమాలు వ్యక్తమవుతున్నాయి.

తెరుచుకోక.. తూకం వెయ్యక..

కరీంనగర్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో చాలా దుకాణాలు ప్రస్తుతం బియ్యం నిల్వలు లేకపోవడంతో తెరుచుకోవడం లేదు. కరీంనగర్‌ కార్పొరేషనలో 71 దుకాణాలు ఉండగా గడిచిన మూడు రోజులుగా 30 వరకు దుకాణాలు తెరుచుకోలేదు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి సరకు రాకపోవడంతో చాలాచోట్ల పంపిణీ చేయడం లేదు. ఇక తెరిచిన దుకాణం వద్ద పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడి వరుసలో నిలబడుతున్నారు. పోర్టబులిటీ విధానం వల్ల ఏ ప్రాంతం వారైనా ఏ డీలర్‌ వద్దకైనా వెళ్లి బియ్యం తీసుకునే వెసులుబాటు ఉండడంతో బియ్యం ఇస్తున్న చోటకి ఎక్కువమంది వెళ్తున్నారు. దీంతో గంటల తరబడి కార్డుదారులు అక్కడే నిలబడాల్సి వస్తోంది. మరోవైపు మూడు నెలలకు సంబంధించి బయోమెట్రిక్‌ ముద్రను ఒక్కో లబ్ధిదారు మూడు సార్లు వేయాల్సి వస్తుండటంతో పంపిణీలో విపరీతమైన ఆలస్యమవుతోంది. ఒక్కొక్కరికి సుమారుగా 10 నిమిషాల సమయం పడుతోంది.

ఇంకా 72,619 కుటుంబాలకు..

జిల్లా వ్యాప్తంగా ఇంకా 72వేలకుపైగా కుటుంబాలకు బియ్యం అందాల్సి ఉంది. మొత్తంగా జిల్లాలో 3,22,198 కుటుంబాలకు రేషనకార్డులు ఉన్నాయి. ఈనెల 22 వరకు 2,49,655 మంది బియ్యాన్ని తీసుకున్నారు. సరఫరాలో 77 శాతం పూర్తయింది. పోర్టబులిటీ సౌకర్యంతో ఇతర ప్రాంతాల్లో కార్డు ఉండి జిల్లాలో నివాసముంటున్న వారిలో ఇప్పటి వరకు 1,06,655 కార్డులకు బియ్యం ఇచ్చారు. దీంతో వచ్చిన కోటాలో స్థానికులకు స్థానికేతరులకు పంపిణీ చేయడం వల్ల డీలర్లకు వచ్చిన బియ్యం ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి. ఈ నెల మొదటి వారంలో ప్రతి డీలర్‌కు 200 క్వింటాళ్లను ఇచ్చారు. ఆ తరువాత అన్ని దుకాణాలకు సరఫరా ఉండాలనే ఉద్దేశంతో 150 క్వింటాళ్లకు కుదించారు. ప్రస్తుతం ఒక్కో దుకాణానికి ఇటీవల 120 క్వింటాళ్ల చొప్పునే సరఫరా చేశారు. దీంతో వచ్చిన ఈ బియ్యం రెండ్రోజుల్లోనే అయిపోవడంతో స్టాక్‌ వచ్చేంత వరకు దుకాణాల్ని తీయడం లేదు. దీంతో కార్డుదారులు బియ్యమెప్పుడొస్తాయి..? ఎప్పుడిస్తారంటూ డీలర్లకు ఫోన్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత ఇబ్బందిని అధిగమించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు తక్షణమే స్పందించి సరఫరాలో ఉన్న లోటును సవరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Updated Date - Aug 23 , 2026 | 01:00 AM