Share News

వైభవంగా రంగనాయకుల స్వామి రథోత్సవం

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:47 PM

సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్ళ గ్రామంలో మానేరు తీరాన వెలసిన రంగ నాయకుల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

వైభవంగా రంగనాయకుల స్వామి రథోత్సవం

సుల్తానాబాద్‌ ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్ళ గ్రామంలో మానేరు తీరాన వెలసిన రంగ నాయకుల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. యేటా చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులపాటు భక్తి, శ్రద్ధలతో కొనసాగాయి. అందులో ముఖ్య ఘట్టమైన రథోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి ఆలయ మాడ వీధులలో ఊరేగించారు. రథాన్ని పూలతో, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు సాగింది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రథోత్సవం సందర్భంగా భక్తులు గోవిందా గోవిందా నామస్మరణతో రథాన్ని లాగారు. యేటా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు వసతి, అన్నదానం ఏర్పాట్లు చేశారు. తాగునీరు, వైద్య సహాయం వంటి సదుపాయాలు కల్పించారు. సుల్తానాబాద్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు.

Updated Date - Apr 06 , 2026 | 11:47 PM