రామగుండం తహసీల్దార్ కార్యాలయానికి తాళం
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:28 AM
రామగుండం తహసీల్దార్ కార్యాలయానికి నాలుగు రోజులుగా తాళం వేసి ఉండటంతో ప్రజలు రెవెన్యూ సేవలకు నోచుకోవడం లేదు. తహసీల్దార్ ఎప్పుడు వస్తాడో తమ బాధలు ఎప్పుడు తీరుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
అంతర్గాం, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): రామగుండం తహసీల్దార్ కార్యాలయానికి నాలుగు రోజులుగా తాళం వేసి ఉండటంతో ప్రజలు రెవెన్యూ సేవలకు నోచుకోవడం లేదు. తహసీల్దార్ ఎప్పుడు వస్తాడో తమ బాధలు ఎప్పుడు తీరుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ తహసీల్దార్‌గా పని చేసిన కుమారస్వామి ఏడాది క్రితం మంథనికి బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో దత్తుప్రసాద్ వచ్చారు. ఆయన విధుల్లో చేరిన నెలలోపే ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీపాద ఈశ్వర్‌ను ఇన్‌చార్జి తహసీల్దార్‌గా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఆయనకు కొద్ది రోజుల తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించగా, సుమారు 8 నెలలపాటు తహసీల్దార్‌గా పని చేసిన శ్రీపాద ఈశ్వర్ తాను ఇక్కడ పని చేయలేనని, పక్షం రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిపోయాడు. ఆయన స్థానంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్న లక్ష్మికి తాత్కాలిక ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఆమె నాలుగు రోజులు పని చేసి డిప్యూటేషన్ పెట్టుకుని వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ సేవలకు ఆటంకం కలగడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ పరిణామాలతో శుక్రవారం సిబ్బంది మొత్తం తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి మూకుమ్మడి సెలవులపై వెళ్లిపోయారు. శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం వస్తారనుకుంటే ప్రజలకు నిరాశే ఎదురయ్యింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో సుమారు 3 లక్షల జనాభా ఉంటుంది. కులం, నివాసం, ఆదాయం, ఓబీసీ తదితర ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే వారు లేక ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తుండటంతో విద్యార్థుల తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, కలెక్టర్ స్పందించి శాశ్వత తహసీల్దార్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.