రూ.248కోట్లతో రామగుండం వార్షిక బడ్జెట్
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:46 PM
రామగుండం నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.248.66కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించింది. 2027 మార్చి నాటికి రూ.28.08కోట్లు మిగిలి ఉంటుందని అంచనా వేసింది. గత సంవత్సరం రూ.246.47కోట్ల వార్షిక బడ్జెట్ ప్రతిపాదించగా ఈ ఏడాది రూ.2కోట్లు పెంచి రూ.248.66కోట్లకు అంచనా వేశారు.
కోల్‌సిటీ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.248.66కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించింది. 2027 మార్చి నాటికి రూ.28.08కోట్లు మిగిలి ఉంటుందని అంచనా వేసింది. గత సంవత్సరం రూ.246.47కోట్ల వార్షిక బడ్జెట్ ప్రతిపాదించగా ఈ ఏడాది రూ.2కోట్లు పెంచి రూ.248.66కోట్లకు అంచనా వేశారు. రూ.28.08కోట్ల ప్రారంభ నిల్వతో గత ఏడాది వార్షిక బడ్జెట్ ప్రారంభం కాగా ఈ ఏడాది కూడా నిల్వ రూ.28కోట్లుగా చూపారు. కాగా 2025-26 ఆదాయానికి సంబంధించి రూ.236కోట్లు అంచనా వేయగా జనవరి 2025-26నాటికి రూ.69.26కోట్లు మాత్రమే సమకూరింది. దీంతో 2025-26 సవరించిన బడ్జెట్ రూ.110.25కోట్లుగా ప్రతిపాదించారు. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ నిల్వ రూ.28కోట్లతో పాటు ఆదాయ అంచనాను 220కోట్లుగా లెక్కగట్టారు. దీనిలో సాధారణ పన్నులు, అనుమతుల రూపంలో రూ.45.46కోట్లు, గ్రాంట్ల రూపంలో రూ.169కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. ఇందులో పన్నుల ద్వారా రూ.21.2కోట్లు, అద్దె, ఫీజుల ద్వారా రూ.1.72కోట్లు, భవన నిర్మాణ అనుమతులు, ఇతర టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి రూ.12.19కోట్లు, ఇంజనీరింగ్ విభాగం నుంచి రోడ్ కట్టింగ్, ఇతర ఆదాయ మార్గాల ద్వారా రూ.7.15కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
ఆదాయంపై మారుతున్న అంచనాలు...
రామగుండం నగరపాలక సంస్థలో ఆస్తి పన్ను, భవన నిర్మాణ అనుమతులు, గ్రాంట్లు తదితర ఆదాయంపై అంచనాలు మారుతున్నాయి. 2025-26లో ఆస్తి పన్ను రూ.12కోట్లు వస్తుందని అంచనా వేయగా సవరించిన బడ్జెట్‌లో రూ.13.39కోట్లు పెట్టారు. 2026-27 బడ్జెట్‌లో రూ.14కోట్లుగా చేర్చారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆస్తులపై రూ.6కోట్లు వస్తుందని అంచనా వేశారు. అలాగే ఆరేళ్ల బకాయిలతో 2024-25లో రూ.16కోట్లు మంజూరయ్యాయి. 2025-26లో రూ.2.5కోట్లు అంచనా వేసినా జనవరి నాటికి నిధులు విడుదల కాలేదు. షాపులపై అద్దెను రూ.50లక్షలు వస్తుందని అంచనా వేయగా రూ.10లక్షలు కూడా వసూలు కాలేదు. అడ్వర్టయిజ్‌మెంట్ ట్యాక్స్ రూపాయి కూడా వసూలు కాలేదు. ట్రేడ్ లైసెన్స్ రూ.50లక్షలు వస్తుందని అంచనా వేశారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో రూ.8కోట్ల నిధులను అంచనా వేయగా జనవరి నాటికి రూ.3.5కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. ఇంజనీరింగ్ విభాగం నుంచి రోడ్ కటింగ్‌తో పాటు ఇతర ఆదాయాల ద్వారా రూ.5.21కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా కేవలం రూ.1.42కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. ఇందులో రోడ్ కటింగ్ చార్జీలు రూ.52లక్షలు, నల్లా బిల్లులు రూ.66లక్షలు ఉన్నాయి.
గ్రాంట్‌లపైనే దృష్టి
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో సాధారణ ఆదాయాన్ని రూ.45.46కోట్లుగా అంచనా వేస్తున్న నగరపాలక సంస్థ రూ.169కోట్లు గ్రాంట్లు వస్తాయని ఆశలు పెట్టుకుంటుంది. ఇందులో నాన్ ప్లాన్ గ్రాంట్ల నుంచి రూ.99.86కోట్లు, ప్లాన్ గ్రాంట్ల నుంచి రూ.11కోట్లు, ఇతర గ్రాంట్ల నుంచి రూ.58.55కోట్లు ఆదాయం వస్తుందని లెక్కలు కడుతుంది. ఇందులో 15వ ఆర్థిక సంఘం టైడ్ గ్రాంట్ల నుంచి రూ.6.21కోట్లు, అన్ టైడ్ గ్రాంట్ల నుంచి రూ.4.14కోట్లు, స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ రూ.1కోటి, అమృత్ రూ.88కోట్లు వస్తుందని అంచనా వేస్తుంది. అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ.5కోట్లు, ఎన్‌టీపీసీ, సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్ తదితర పరిశ్రమల సీఎస్‌ఆర్‌ల నుంచి రూ.5కోట్లు, టీయూఎఫ్‌ఐడీసీ నుంచి రూ.50కోట్లు, డీఎంఎఫ్‌టీ, కలెక్టర్ నిధుల నుంచి రూ.4కోట్లు వస్తుందని అంచనా వేశారు.
అవుట్ సోర్సింగ్ వేతనాలకు రూ.16కోట్లు...
రామగుండం నగరపాలక సంస్థలో ఇతర కార్పొరేషన్లతో పోల్చితే సాధారణ ఆదాయం తక్కువ. అదే సమయంలో అవుట్ సోర్సింగ్ వేతనాలు ఎక్కువ. కార్పొరేషన్‌లో వివిధ విభాగాల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐకి ఈ ఏడాది రూ.16కోట్లు కేటాయించారు. పారిశుధ్య నిర్వహణకు రూ.6.57కోట్లు కేటాయిస్తే ఇందులో వాహనాల ఇంధనానికి రూ.3కోట్లు, పారిశుధ్య సిబ్బంది పనిముట్లకు రూ.10లక్షలు, కెమికల్స్, బ్లీచింగ్ పౌడర్, దోమల మందు కొనుగోలు రూ.20లక్షలు, కుక్కలు, కోతులు, పందుల నియంత్రణకు కేవలం రూ.30లక్షలు కేటాయించారు. మొత్తంగా పారిశుధ్య విభాగానికి రూ.6.57కోట్లు, విద్యుత్ చార్జీలకు రూ.2.45కోట్లు, రుణాల చెల్లింపులకు రూ.2కోట్లు, గ్రీన్ బడ్జెట్‌కు రూ.31.57కోట్లు కేటాయించారు.
పొంతనలేని వ్యయాల అంచన...
నగరపాలక సంస్థ పరిధిలో వ్యయాల విషయంలో వాస్తవ పరిస్థితులకు, అంచనాలకు పొంతన లేకుండా ఉంది. ముఖ్యంగా పార్కులు, ఆట స్థలాలకు రూ.10లక్షలు, శ్మశాన వాటిక నిర్వహణ, వైకుంఠ రథాల నిర్వహణకు రూ.10లక్షలు, రోడ్లు, బ్రిడ్జిల మరమ్మతుకు రూ.40లక్షలు, యూజీడీ నిర్వహణకు రూ.15లక్షలు, కాలువల మరమ్మతులకు రూ.30లక్షలు, వీధి దీపాల విడిభాగాల కొనుగోలుకు రూ.50లక్షలు, పోల్ షిఫ్టింగ్, కొత్త పోల్స్, థర్డ్ వైర్ చార్జీల క్రితం రూ.60లక్షలు కేటాయించారు.
25న బడ్జెట్ సమావేశం
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఈ నెల 25న కౌన్సిల్‌లో పెట్టనున్నారు. అదే రోజు ఉదయం బడ్జెట్ మీటింగ్ తరువాత సాధారణ సమావేశం నిర్వహించనున్నారు.