Share News

రాజన్న సిరిసిల్ల : ‘ఎల్‌ఆర్‌ఎస్‌’కు మరో అవకాశం

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:22 AM

అనధికార లేఅవుట్ల క్రమబద్దీకరణకు లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)కు ప్రభుత్వం దరఖాస్తుదారులకు మరోసారి అవకాశం ఇచ్చింది. జూలై31 వరకు 25శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు చెల్లించుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌కు నామమాత్రంగానే స్పందన కనిపిస్తోంది.

రాజన్న సిరిసిల్ల :  ‘ఎల్‌ఆర్‌ఎస్‌’కు మరో అవకాశం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అనధికార లేఅవుట్ల క్రమబద్దీకరణకు లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)కు ప్రభుత్వం దరఖాస్తుదారులకు మరోసారి అవకాశం ఇచ్చింది. జూలై31 వరకు 25శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు చెల్లించుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌కు నామమాత్రంగానే స్పందన కనిపిస్తోంది. రియల్‌ భూమ్‌ లేకపోవడంతో రియల్‌ వ్యాపారులు క్రమబద్ధీకరణకు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు గ్రామపంచాయతీల పరిధిలో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఆరేళ్లుగా కసరత్తు చేస్తూనే ఉంది. గత సంవత్సరం మార్చి31వ తేదీ వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులో 25 రాయితీ ఇచ్చింది. ఆ గడువు ముగిసిన తర్వాత జూన్‌ 30 వరకుపొడిగించింది. జిల్లాలో కొంతమంది దరఖాస్తులు ముందుకు వచ్చినా చిన్నచిన్న లోపాలతో దరఖాస్తులు పెండింగ్‌లో చూపడంతో నిరాశపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం మరోసారి 25రాయితీతో అవకాశం కల్పించడం ద్వారా షార్ట్‌ఫాల్‌ను సరిచేసుకొని క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తున్నారు. గతసంవత్సరం రాయితీ సమయంలో జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా దాదాపు రూ.40 కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావించినా రూ20.68కోట్ల వరకు మాత్రమే ఆదాయం లభించింది. ఈ సారి ఇచ్చిన గడువు ద్వారా మరో రూ.60 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

దృష్టిసారించిన కలెక్టర్‌..

ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసే దిశగా జిల్లా కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ దృష్టిసారించారు. మున్సిపల్‌, మండల పరిషత్‌, రెవెన్యూ, పంచాయతీ శాఖ, నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మార్గనిర్దేశం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు ఫోన్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. అంతేకాకుండా మున్సిపాలిటీ, మండల పరిషత్‌ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసే దిశగా సూచించారు. ప్రభుత్వం కల్పించిన రాయితీని ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.

జిల్లాలో 43150ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు..

రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్దీకరణకు సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలతోపాటు 260 గ్రామపంచాయతీల పరిఽధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా క్రమబద్దీకరణ కోసం 43150 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 28075 దరఖాస్తులకు రాయితీకి అవకాశం కల్పించారు. 3316దరఖాస్తులు తిరస్కరించారు. 6051దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. 5708 దరఖాస్తు దారులు ఫీజు చెల్లించి క్రమబద్ధీకరించుకున్నారు. ఒక్కో ఫ్లాట్‌కు గత మార్కెట్‌ ధరలకు అనుగుణంగా కనీసం రూ.20నుంచి రూ.50వేల వరకు అదాయం లభి స్తుంది. కేవలం 260గ్రామ పంచాయతీల నుంచి 16113 దరఖాస్తులు వచ్చాయి.

ముందుకు రాని దరఖాస్తుదారులు..

అనుమతి లేని ప్లాట్లు లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌లో 25శాతం రాయితీ నిర్ణయంతో దరఖాస్తుల పక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం భావించినా అనుకున్నా దరఖాస్తుదారులు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. జిల్లాలో భూముల ధరలు ఆశాజనకంగా లేక పోవడం, అమ్మకాలు లేకపోవడం, భూ సంబంధ వివాదాలు కేసులపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత లేకపోవడం వంటి కారణాలతోనే దరఖాస్తు దారులు ముందుకు రావడం లేదని భావిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినా యూజర్‌ మాన్యువల్‌ ఫీ రిజిస్ట్రేషన్‌ వెబ్‌సైట్‌కు సంబంధించి సాంకేతిక సమస్యలు, సర్వర్‌లు బిజీగా ఉండడం, ఆన్‌లైన్‌ పక్రియ ముందుకు సాగకపోవడం, దరఖాస్తుదారులకు నేరుగా అటో జనరేట్‌ మేసేజ్‌లు వెళ్లకపోవడం, సర్వర్‌లు మొరాయించడం వంటి ఇబ్బందులను దరఖాస్తుదారులు ఎదుర్కొన్నారు.

జిల్లాలో వచ్చిన దరఖాస్తుల వివరాలు

===========

మున్సిపాలిటీ/మండలం దరఖాస్తులు

---------------------------- ------------------

సిరిసిల్ల 10493

వేములవాడ 16336

చందుర్తిలో 213

ఇల్లంతకుంటలో 1054

గంభీరావుపేటలో 861

కోనరావుపేటలో 277

వేములవాడ అర్బన్‌ 3702,

ముస్తాబాద్‌ 1074

ఎల్లారెడ్డిపేట 3949

తంగళ్లపల్లి 3784

వేములవాడ రూరల్‌ మండలం 214

రుద్రంగి 304

వీర్నపల్లి 71

Updated Date - Jul 05 , 2026 | 12:22 AM