Share News

రైస్‌మిల్లుల వద్ద లారీల క్యూ

ABN , Publish Date - May 10 , 2026 | 11:44 PM

సుల్తానాబాద్‌ ప్రాంతంలోని రైస్‌మిల్లుల వద్ద ఎక్కడ పడితే అక్కడ ధాన్యం లారీలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలలోని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లారీలు నేరుగా వారికి కేటాయించిన రైస్‌మిల్లులకు చేరుకుంటున్నాయి. మిల్లర్లు ధాన్యం బాగాలేదనే చెపుతూ అనధికారికంగా కటింగ్‌ పెడుతూ ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవడం లేదు.

రైస్‌మిల్లుల వద్ద లారీల క్యూ

సుల్తానాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌ ప్రాంతంలోని రైస్‌మిల్లుల వద్ద ఎక్కడ పడితే అక్కడ ధాన్యం లారీలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలలోని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లారీలు నేరుగా వారికి కేటాయించిన రైస్‌మిల్లులకు చేరుకుంటున్నాయి. మిల్లర్లు ధాన్యం బాగాలేదనే చెపుతూ అనధికారికంగా కటింగ్‌ పెడుతూ ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో ధాన్యం లారీలు ట్రాక్టర్లు మిల్లుల వద్ద బారులు తీరుతున్నాయి. ఫలితంగా కేంద్రాలలో కొనుగోలు కాంటా వేసి సంచుల్లో నింపిన ధాన్యాన్ని మిల్లులకు సకాలంలో పంపేందుకు లారీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. మరో వైపు దిగుమతులు ఆలస్యం అవుతుండడం వలన ట్రక్‌ షీట్ల జనరేషన్‌ చేయడం లేదు. ట్యాబ్‌ ఎంట్రీలు కూడా సకాలంలో నమోదు కావడం లేదు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న లారీలను ట్రాక్టర్లలోని ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం వేగవంతం చేయాలంటూ కలెక్టర్‌ మిల్లర్లను ఆదేశించారు. రెండు రోజులు సుల్తానాబాద్‌ ప్రాంతంలోని పలు రైస్‌మిల్లులను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మిల్లర్లు అధికారులకు పలు సలహాలు సూచనలు అందించారు. కొనుగోలు కేంద్రాలలో కూడా ధాన్యం నిలువలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. స్థలం లేని దుస్థితి నెలకొంది. తేమ శాతం వస్తున్నా ధాన్యాన్ని సత్వరంగా కాంటా వేయడం లేదని రైతులు అంటున్నారు. మరో వైపు వాతావరణం బాగాలేదని, ఐదారురోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో మండల స్థాయి అధికారులు ఎక్కడా కొనుగోళ్ల గురించి పట్టించుకోవడం లేదు. సహకార సంఘాల ఆధ్వర్యంలో కొన్ని ఐకేపీ ద్వారా, మహిళా సంఘాల ద్వారా మరికొన్ని కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కేంద్రాలలో కొనుగోళ్లను పారదర్శకంగా జరిపించడం, ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను పర్యవేక్షించడం, రైతులను కటింగ్‌ పేరిట ఇబ్బందుల పెడుతున్న మిల్లర్ల గురించి పట్టించుకోవడం వంటి పర్యవేక్షణ పనులు కొరవడ్డాయి. దీంతో రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్ల ప్రక్రియను మండల స్థాయి అధికారులు తరుచూ పర్యవేక్షించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

నేరుగా మిల్లర్ల వద్దకే ధాన్యం

మండలంలోని అన్ని గ్రామాలలో వరి కోతలు ఊపందుకున్నాయి. కొందరు రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందాలని చూస్తుండగా మరి కొందరు రైతులు నేరుగా ట్రాక్టర్లలో మిల్లుకు తరలించి అమ్ముకుంటున్నారు. వెంటనే డబ్బులు పొందుతున్నారు. అయితే ఈ వడ్లకు మిల్లర్లు క్వింటాలుకు 1900 రూపాయలు చెల్లిస్తున్నారు. కేంద్రాలకు తరించడం, రోజుల తరబడి వేచి ఉండడం, వర్షం వస్తే తడిసి అసలుకే మోసం వస్తుందనే భయంతో ధర తక్కువ అయినా కూడా రైతులు కోతల నుంచి నేరుగా మిల్లర్లకు అమ్ముకుంటున్నారు.

Updated Date - May 10 , 2026 | 11:44 PM