Share News

ఉద్రిక్తతల నడుమ పైలాన్‌ తొలగింపు

ABN , Publish Date - Nov 03 , 2026 | 11:22 PM

గోదావరిఖని కోర్టు చౌరస్తాలో ఉన్న పైలాన్‌(అభివృద్ధి పనుల శంకుస్థాపన స్థూపం)ను మంగళవారం నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం తొలగించింది. గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్‌ పర్యటన సందర్భంగా నడి రోడ్డుపై పైలాన్‌ను ఏర్పాటు చేశారు.

ఉద్రిక్తతల నడుమ పైలాన్‌ తొలగింపు

కోల్‌సిటీ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని కోర్టు చౌరస్తాలో ఉన్న పైలాన్‌(అభివృద్ధి పనుల శంకుస్థాపన స్థూపం)ను మంగళవారం నగరపాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం తొలగించింది. గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్‌ పర్యటన సందర్భంగా నడి రోడ్డుపై పైలాన్‌ను ఏర్పాటు చేశారు. పైలాన్‌ వలన ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందంటూ ఫిర్యాదులతో నగర పాలక సంస్థ దీనిని తొలగించి మరో చోట ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. మంగళవారం టౌన్‌ ప్లానింగ్‌ ఇన్‌చార్జి ఏసీపీ నవీన్‌ ఆధ్వర్యంలో ఈ తొలగింపు కార్యక్రమం చేపట్టారు. పైలాన్‌ను క్రేన్‌తో తీస్తుండగా బీఆర్‌ఎస్‌ రామగుండం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆగ్రహానికి గురైన కోరుకంటి చందర్‌ క్రేన్‌ ఆపరేటర్‌పై దాడికి పాల్పడ్డాడు. తమ ముందేదాడి జరుగుతుండడంతో వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు హరీష్‌రెడ్డి, కౌశిక హరి, విజయారెడ్డి, కార్పొరేటర్లు ఘటన స్థలానికి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. కమిషనర్‌ రావాలంటూ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. డీజిల్‌ క్రేన్‌ టైర్లపై పడడంతో ఆపరేటర్‌ క్రేన్‌ను వెనకకు తీసే ప్రయత్నం చేయగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆపరేటర్‌, క్రేన్‌ యజమానిపై సైతం దాడికి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు కోరుకంటి చందర్‌, కౌశిక హరి, హరీష్‌రెడ్డి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. బీఆర్‌ఎస్‌ నాయకులను వివిధ ఠాణాలకు తరలించారు. రామగుండంలో కూల్చివేతల పర్వం కొనసాగుతుందని, బీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధి పనుల కోసం వేసి పైలాన్‌ను తొలగించడం సరికాదన్నారు.

పోలీసుల విజ్ఞప్తి మేరకే పైలాన్‌ తొలగింపు

గోదావరిఖని కోర్టు చౌరస్తాలో ప్రధాన రహదారిపై ఉన్న పైలాన్‌ కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఏర్పాటు చేయడానికి వీలుగా దానిని తొలగించాలని వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ అక్టోబరు 27న లేఖ సమర్పించారని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదారులకు, రోడ్డు దాటే వారికి లేబర్‌ కోర్టు వద్ద ఉన్న పైలాన్‌ ప్రమాదకరంగా మారిందని, పోలీస్‌శాఖ గుర్తించి ప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారని, పైలాన్‌ ఏర్పాటు చేసిన తరువాత 2024లో నలుగురు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని, 2025లో ముగ్గురు గాయపడి ఇద్దరు చనియయారని, 2026లో ఒకరు గాయపడ్డారని లేఖలో పేర్కొన్నట్టు, రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం నివారించడానికి పైలాన్‌ను అక్కడి నుంచి తొలగించాలని కోరడంతో నగరపాలక సంస్థ తరపున యంత్రాలు, వాహనాలు ఏర్పాటు చేసి పోలీస్‌కు సహకారం అందించినట్టు పేర్కొన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 11:22 PM