దుర్గామాత విగ్రహాలకు కాళేశ్వరం జలాలతో శుద్ధి
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:35 PM
దుర్గామాత విగ్రహాలకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గోదావరి నది వద్ద నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేయకపోవడం, మురికి నీటిలో నిమజ్జనం చేయడాన్ని నిరసిస్తూ గురువారం ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కాళేశ్వరం త్రివేణి సంగమం నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి నిమజ్జనం చేసిన అమ్మవారి విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు.
కోల్సిటీ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): దుర్గామాత విగ్రహాలకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గోదావరి నది వద్ద నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేయకపోవడం, మురికి నీటిలో నిమజ్జనం చేయడాన్ని నిరసిస్తూ గురువారం ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కాళేశ్వరం త్రివేణి సంగమం నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి నిమజ్జనం చేసిన అమ్మవారి విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో దుర్గామాతకు భక్తులు పూజలు నిర్వహించి నిమజ్జనం చేయడానికి గోదావరి నదికి వెళితే కనీస ఏర్పాట్లు చేయడంలో రామగుండం కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. గోదావరి నదిలో మురుగు నీరు ప్రవేశించే చోట గుంతలు తోడి అక్కడ నిమజ్జనం చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి విగ్రహాలకు పూజలు చేసి నిమజ్జనం చేస్తే మురుగు నీటిలో నిమజ్జనం చేయడంతో పవిత్ర జలాలను తీసుకువచ్చి అమ్మవారి విగ్రహాలను శుద్ధి చేశామన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వతమైన పరిష్కారం చూపాలని ఆమె డిమాండ్ చేశారు. దుర్గామాత క్షమించమని గుంజీలు తీశారు. బీజేపీ నాయకులు కోడూరి రమేష్, అపర్ణ, కందుల పోషం, సాతిరి గంగరాజు పాల్గొన్నారు.