మద్దతు ధర అందించేందుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ABN , Publish Date - Nov 03 , 2026 | 11:30 PM
ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందేలా జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి, నవంబరు3(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందేలా జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు బహిరంగ మార్కెట్‌లో మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం విక్రయించుకునే పరిస్థితి రాకుండా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 4.69 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం, 26 వేల మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం ఉత్పత్తి అయినట్లు తెలిపారు. సన్నరకంకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తుందని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో ధాన్యం ధరలు తగ్గిన పక్షంలో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ నెల రెండో వారం నుంచి పెద్ద ఎత్తున ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ఏర్పాట్లను పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలో ప్రతిపాదించిన 311 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, కొనుగోలు కేంద్రాలకు సుమారు 2 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 1,62,500 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములు అందుబాటులో ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డిసిఓ శ్రీమాల, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, డిఆర్‌డిఓ కాళిందిని, అధికారులు పాల్గొన్నారు.