ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:47 PM
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
పెద్దపల్లిటౌన్, జూలై 20(ఆంధ్రజ్యోతి) అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. గోదావరిఖనికి చెందిన ఎం. శ్రీలత ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ పోస్ట్ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా వారధి సొసైటీకి రాశారు. జూలపల్లి మండలం కోనరావుపేటకు చెందిన గడ్డం పద్మ, కోట ఉషశ్రీ తల్లి పేరు మీద ధూళికట్ట శివారు సర్వేనెంబర్ 591లో ఉన్న ఎకరం 12 గుంటల భూమి తమకు తెలియకుండా సోదరి విక్రయించిందని, ఆ పొలాలను తమ పేరు మీద విరాసత్ చేయాలని దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ కు రాస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎలిగేడు మండలం నర్సాపూర్‌కు చెందిన తంగళ్ళ కుమారస్వామి గ్రామపంచాయతీ కార్యాలయం మిగులు పనులు, అభివృద్ధి పనుల బిల్లులు 2023 నుంచి పెండింగ్ ఉన్నాయని, నిధులు ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన బొడ్డుపల్లి శ్యామల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా పిడి హౌసింగ్‌కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.