ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:04 AM
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పిలుపునిచ్చారు. రంగాపూర్‌లోని రాధాకృష్ణ ఏసీ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంపై ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
పెద్దపల్లి రూరల్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పిలుపునిచ్చారు. రంగాపూర్‌లోని రాధాకృష్ణ ఏసీ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంపై ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 99 రోజుల కార్యక్రమం జూన్ 12 వరకు కొనసాగుతుందని, సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ స్థానికంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మన పనితీరు ఉండాలని తెలిపారు. ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకుంటూ క్షేత్రస్థాయి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. వేసవి కాలంలో జిల్లాలో తాగు నీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. గత పాలకులు వైఫల్యం కారణంగా ప్రజలు మనకు అవకాశం ఇచ్చారని, రెండు సంవత్సరాలలో రైతు రుణమాఫీ, రైతుభరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం సరఫరా వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశామన్నారు. రానున్న బడ్జెట్లో పంచాయతీ, మున్సిపాలిటీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ రంగానికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని అన్నారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధికి నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందని మంత్రి తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు అవగాహన అందించేందుకు ఏర్పాటుచేసిన శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, లబ్ధిదారుల ఎంపిక, ప్రభుత్వ పని తీరు లో వచ్చిన మార్పులు తెలుసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన గత 2 సంవత్సరాలలో గత పాలకులు ఖజానా ఖాళీ చేసినప్పటికీ ప్రభుత్వ సిబ్బందిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేస్తూ అద్భుతమైన పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు గత పాలకులు అనేక వంకలు పెట్టి కోతలు విధించే వారని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రజాప్రతినిధులు చొరువ చూపాలన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని, ఎక్కడా కక్ష పూరితంగా వ్యవహరించడం లేదన్నారు. రోడ్లు, డ్రైనేజీ , ఇతర అభివృద్ధి పనులతో పాటు పారిశుధ్య నిర్వహణ, చెట్ల పెంపకంపై కూడా స్థానిక ప్రజాప్రతినిధులు శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ లు, సర్పంచులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.