Share News

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:42 PM

జిల్లాలో సుమారు 12 వేల మంది విద్యార్థులు రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి అందించే ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్‌ కోయశ్రీహర్ష స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో కేజీబీవీ, గురుకుల విద్యాసంస్థలు, ఆదర్శ పాఠశాలల వంట మనుషులతో సమీక్ష నిర్వహించారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

పెద్దపల్లి కల్చరల్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సుమారు 12 వేల మంది విద్యార్థులు రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి అందించే ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్‌ కోయశ్రీహర్ష స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో కేజీబీవీ, గురుకుల విద్యాసంస్థలు, ఆదర్శ పాఠశాలల వంట మనుషులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆహార విషబాధ, వాంతులు, తాగునీటి సమస్యలు తదితర సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో పెద్ద సమస్యలుగా మారుతున్నాయని, రాజకీయ కారణాలతో మరింత విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. కూరగాయలు, గుడ్లు, మాంసం వంటి పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేయాలని, వంట విధానం, పదార్థాల నాణ్యతపై వంట మనుషులు అత్యంత జాగ్రత్త వహించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా మాంసాహార వంటకాలు శ్రద్ధతో తయారు చేయాలని సూచించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతపై కూడా పర్యవేక్షణ అవసరమన్నారు. వంట విషయాల్లో చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం డైట్‌ చార్జీలు పెంచి, చెల్లింపులు సమయానికి చేస్తున్నందున, నిర్ణయించిన మెనూను వంద శాతం పాటించాలని, అన్ని రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు ఒకే సాధారణ మెనూను అమలు చేయాలని ఆదేశించారు. గత ఏడాది ముత్తారం కేజీబీవీపీలో జరిగిన ఆహార విషబాధ ఘటన పునరావృతం కాకుండా, రోజు అప్రమత్తంగా ఉండాలని వంట మనుషులకు సూచించారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అరవింద్‌ రెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 11:42 PM