Share News

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:03 AM

వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ వైద్యులకు సూచించారు. బుధవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని తనిఖీ చేశారు. వివిధ విభాగాల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ వైద్యులకు సూచించారు. బుధవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని తనిఖీ చేశారు. వివిధ విభాగాల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జనరల్‌ వార్డ్‌, ఆపరేషన్‌ థియేటర్లను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ జీజీహెచ్‌కు వచ్చే పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని, కొందరు వైద్యులు మధ్యాహ్నం వరకే ఉండి వెళ్లిపోతున్నారని, దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, 24గంటలు వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో తక్షణమే వైద్య సేవలు అందించి రోగుల ప్రాణాలను కాపాడాలని, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా హైదరాబాద్‌, కరీంనగర్‌లోని ఆసుపత్రులకు రెఫర్‌ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, జీజీహెచ్‌లో అన్నీ సౌకర్యాలు ఉన్నప్పటికీ రోగులను రెఫర్‌ చేయడం సరైంది కాదన్నారు. ఐదు అంతస్థుల భవన నిర్మాణం పూర్తయితే మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, కార్పొరేట్‌ స్థాయిలో జీజీహెచ్‌లో కొత్త భవన నిర్మాణాన్ని చేస్తున్నట్టు, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు అంకిత భావంతో పని చేయాలని సూచించారు.

డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు...

కొందరు సిబ్బంది ఆసుపత్రిలో పేద రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ప్రసవాల సమయంలో ఆడపిల్ల పుడితే రూ.1000, మగపిల్లవాడు పుడితే రూ.2000వేలు బలవంతంగా వసూలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా రోగుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సూపరింటెండెంట్‌పై ఆగ్రహం

గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగులు పలు ఫిర్యాదులు చేయడంతో సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, శానిటేషన్‌ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. బాత్‌ రూమ్‌లలో నీళ్లు లీకవుతున్నాయని, వాటిని అరికట్టి బాత్‌రూమ్‌లు శుభ్రంగా ఉంచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిటీ స్కాన్‌ పని చేయకపోవడంతో రోగులు బయటకు వెళుతున్నారని, వెంటనే సిటీ స్కాన్‌ మరమ్మతు చేసి రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చి నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Updated Date - Nov 26 , 2026 | 12:03 AM