రోగులకు మెరుగైన వైద్య సేవలందించండి
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:33 AM
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి వైద్యులకు సూచించారు. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన 4వ డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక భర్త రాజును గురువారం పరామర్శించారు.
కళ్యాణ్‌నగర్, జూన్ 18(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి వైద్యులకు సూచించారు. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన 4వ డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక భర్త రాజును గురువారం పరామర్శించారు. అనంతరం వార్డులను సందర్శించారు. ఆసుపత్రి అప్‌గ్రేడ్ అయిన తరువాత ఖని జనరల్ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగిందని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. తరచుగా విద్యుత్ సమస్య తలెత్తుందని వైద్యులు మేయర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఎన్‌పీడీసీఎల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రామగుండంను మెడికల్ హబ్‌గా మార్చడానికి ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ కృషిచేస్తున్నారని, ఐదు అంతస్థుల భవన నిర్మాణం పూర్తయితే జిల్లాతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పేదలకు మెరుగైన వైద్యం అందించవచ్చునన్నారు. అత్యవసర సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చిన మేయర్‌కు సూపరింటెండెంట్ హిమబిందు, ఆర్‌ఎంఓ కృపాభాయి బుక్‌లను అందజేశారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు యుగంధర్, గట్ల రమేష్, వైద్యులు నాగిరెడ్డి ఉన్నారు.