Share News

నేటి నుంచే ‘ప్రగతి ప్రణాళిక’

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:48 AM

పల్లెలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన సంక్షేమ ప్రగతి పనులను పూర్తి చేయడంపై దృష్టిపెట్టిన అధికారులు పాలనను పరుగులు పెట్టించేందుకు చర్యలు చేపడుతున్నారు.

నేటి నుంచే ‘ప్రగతి ప్రణాళిక’

జగిత్యాల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పల్లెలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన సంక్షేమ ప్రగతి పనులను పూర్తి చేయడంపై దృష్టిపెట్టిన అధికారులు పాలనను పరుగులు పెట్టించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి జూన 12వ తేదీ వరకు పది రకాల అంశాలపై 99 రోజుల పాటు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి ఇటీవల హైద్రాబాద్‌లో సమావేశం నిర్వహిం చి కార్యాచరణ వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రణాళికను పటిష్టంగా అమలు చేయడానికి అధికార యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలో 99 రోజుల కార్యాచరణ విజయవంతం చేయడానికి అనుగుణంగా రెండు రోజుల క్రితం కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

సర్కారు విద్యపై దృష్టి..

జిల్లాలో 99 రోజుల వ్యవధిలో ప్రత్యేకంగా సర్కారు విద్యపై దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం ఇంటర్‌ విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండగా..తర్వాత పదో తరగతి, ఆపై మిగితా తరగతులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉత్తమ ఫలితాలతో పాటు వేసవిలో బడుల్లో పెండింగ్‌ పనులు పూర్తిచేయడంపై దృష్టి సారించారు. జూన 12వ తేదీ వరకు అంటే బడులు ప్రారంభం నాటికే విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు అందిచాల్సి ఉంటుంది. కలెక్టర్‌ సత్య ప్రసాద్‌తో పాటు ఇతర అధికారులు వసతి గృహాలు, పాఠశాలలో వసతులు, భోజనంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తారు. జిల్లాలో మూడుచోట్ల యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం, నవోదయ పాఠశాల నిర్వహణ, కేంద్రీయ విద్యాలయం తదితర పనులను వేగవంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వైద్యారోగ్యంపై శ్రద్ధ..

జిల్లా ప్రధాన ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాల, సీహెచసీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల్లో మెరుగైన సేవలు అందించేవిధంగా 99 రోజుల కార్యక్రమంలో చర్యలు తీసుకోనున్నారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవన నిర్మాణాలు వేగవంతం చేయనున్నారు. జిల్లాలో మాతాశిశు మరణాలను తగ్గించడం, ప్రసూతి సమయంలో శస్త్రచికిత్సలను తగ్గించడంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

పల్లె నుంచి పట్టణం దాకా..

జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీలతో పాటు అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం ప్రత్యేకంగా అమలు కానుంది. రోజువారీగా తాగునీరు, విద్యుత సరాఫరా, మురుగునీటి పారుదల, పారిశుధ్యం, చెత్తసేకరణ, డంపింగ్‌ యార్డు, క్రీడా మైదానాలు, పిల్లల పార్కులు, సమీకృత మార్కెట్ల నిర్మాణం పూర్తిచేయడంపై దృష్టి సారించారు. పట్టణాల్లో అమృత 2.0 పథకం కింద జరుగుతున్న పనులను వేగవంతం చేయనున్నారు. ఈనెల 12వ జిల్లా స్థాయిలో కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్లకు ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నారు.

సంక్షేమ పథకాల అమలుపై పర్యవేక్షణ..

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. రేషన షాపుల్లో సన్నబియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్య, ఆరోగ్యశ్రీ సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత మహిళ బస్‌ ప్రయాణం, రైతులకు సబ్సీడీలు, మహిళా సంఘాలకు రుణాలు, సంక్షేమశాఖల్లో లబ్ధిదారుల ఎంపిక వంటివి అమలు చేయడం, పర్యవేక్షణ నిర్వహించడం వంటివి చేయనున్నారు.

ప్రత్యేక కార్యక్రమాలు ఇలా..

జిల్లాలో మార్చి 6వ తేదీ నుంచి జూన 12వ తేదీ వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మార్చి 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పరిసరాల శుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌ ఫైళ్ల పరిష్కారంపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నారు. ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆద్వర్యంలో ప్రత్యేక శిభిరాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 13వ తేదీ నుంచి 18వ తేదీవ రకు రవాణాశాఖ ఆద్వర్యంలో రోడ్డు భద్రతా, ట్రాఫిక్‌ నియమాలపై, ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పిల్లల భద్రత, రక్షణపై, డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు, మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వ్యవసాయ రంగంపై, మే 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విద్యా రంగంపై, 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు యువత, క్రీడలు అంశంపై, మే 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మహిళల అంశంపై సమావేశాలు నిర్వహించాలన్న మార్గదర్శకాలను రూపొందించారు. జూన ఒకటో తేదీ నుంచి 12వ తేదీ వరకు పర్యావరణంపై ప్రత్యేకకార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతీరోజు నిర్వహించిన కార్యక్రమాలను ప్రగతి నివేదిక రూపంలో సమర్పించనున్నారు.

పకడ్బందీగా నిర్వహిస్తాం

- సత్యప్రసాద్‌, కలెక్టర్‌

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాము. ఇప్పటికే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌అండ్‌బీ, ప్రణాళిక, ఇరిగేషన, వ్యవసాయం, ఉద్యానవన, విద్య, వైద్య, హౌసింగ్‌, ఆర్డబ్ల్యూఎస్‌, మహిళ మరియు శిశు సంక్షేమ, సంక్షేమ శాఖలు, మెప్మా, మున్సిపాలిటీలు తదితర శాఖల అధికారులతో ప్రాథమిక సమీక్ష సమావేశం నిర్వహించాము. వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారుల నుంచి వారి శాఖ చేయవలసిన కార్యక్రమాల వివరించాము.

Updated Date - Mar 06 , 2026 | 12:48 AM