Share News

సమస్యల స్వాగతం

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:47 AM

కొత్తపల్లి మున్సిపాలిటీ, శివారు గ్రామాల విలీనంతో నగరపాలక సంస్థ విస్తీర్ణం, జనాభా పెరిగింది. కాని ఆ స్థాయిలో నిధులు రావడం లేదు. దీంతో నగరవాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడలేదు.

సమస్యల స్వాగతం

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లి మున్సిపాలిటీ, శివారు గ్రామాల విలీనంతో నగరపాలక సంస్థ విస్తీర్ణం, జనాభా పెరిగింది. కాని ఆ స్థాయిలో నిధులు రావడం లేదు. దీంతో నగరవాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడలేదు. రెండేళ్లుగా కార్పొరేషన్‌కు ఎలాంటి గ్రాంట్లు, నిధులు విడుదల చేయలేదు. సుడా నిధులతో అక్కడక్కడ కొంత మేరకు అభివృద్ధి పనులు జరిగినా అవి నామమాత్రంగానే జరిగాయనే విమర్శలున్నాయి.

నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులు

గత సంవత్సరం జనవరి 27న పాలకవర్గం పదవీకాలం ముగియడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోయాయి. దీంతో నగర ప్రజల నుంచి వివిధ రూపాల్లో వసూలవుతున్న జనరల్‌ ఫండ్‌ నిధులే కార్పొరేషన్‌కు ప్రధాన ఆదాయవనరుగా మారింది. ఆ నిధులు ఉద్యోగుల జీతభత్యాలు, కరెంటు బిల్లులు, వాహనాలు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు, ఇతరత్రా సేవలకు సరిపోవడం లేదు. ప్రతినెలా నిర్వహణ భారం తగ్గించేందుకు అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ పన్నులు వసూలు చేస్తూ నెట్టుకువస్తున్నారు. దీంతో నగరంలో రెండేళ్లుగా అభివృద్ధి పనులు పూర్తిగా పడకేశాయి. శివారు గ్రామాలతోపాటు నగర ప్రజలు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతున్నారు. గతంలో స్మార్ట్‌సిటీ, పట్టణ ప్రగతి, సీఎం హామీ నిఽధులు, అమృత్‌-1, 2, ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులతో గుర్తింపు సాధించినా, ప్రధాన సమస్యలు ఇంకా పరిష్కారమవ్వలేదు. సాంకేతికపరమైన అడ్డంకులు, నిధుల కొరత కార్పొరేషన్‌ను వేధిస్తోంది.

ఇటీవల జరిగిన మున్సి‘పోల్స్‌’లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనే మొట్టమొదటగా కరీంనగర్‌ బల్దియాపై కాషాయపు జెండాను ఎగురవేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారి బీజేపీకి అవకాశమివ్వండి కరీంనగర్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ హామీ ఇవ్వడంతో నగర ప్రజలంతా మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ నాయకత్వంలో పాలకవర్గంపైనే కోటి ఆశలు పెట్టుకున్నారు. ఆదివారం మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అధికారికంగా బాధ్యతలను స్వీకరిస్తున్నారు.

మౌలిక సదుపాయాలు మెరుగుపడేనా...

రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్‌ ప్రధాన బాధ్యత. స్మార్ట్‌సిటీ నిధులతో నగరంలోని చాలా చోట్ల అంతర్గత రోడ్లు మెరుగుపడినా ఇంకా కొన్ని చోట్ల పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలిపెట్టారు. కొత్తపల్లి మున్సిపాలిటీ, విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో చాలా చోట్ల రోడ్లను బాగు చేయాల్సిన అవసరముంది. బీఆర్‌ఎస్‌ హయాంలో పట్టణ ప్రగతి, సీఎం హామీ నిధులతో ప్రారంభించిన రోడ్లు, డ్రైనేజీల్లో 64 చోట్ల పనులను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో రెండేళ్లుగా ప్రజలు అక్కడ నరకయాతన పడుతుండగా ఇటీవల కొన్ని పనులను తిరిగి ప్రారంభించారు. వాటిని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరముంది. కార్పొరేషన్‌లో చాటా చోట్ల డ్రైనేజీలు లేక రోడ్లపైన, ఇళ్ల మధ్యన మురుగు నీటిని వదిలి పెడుతుండడంతో పందులు, దోమలు, దుర్వాసనతో వ్యాధుల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డంపుయార్డు సమస్యకు పరిష్కారం లభించేనా..

తడి, పొడిచెత్తను వేరగా సేకరించి తడిచెత్తతో సేంద్రీయ ఎరువు, పొడిచెత్తను ఎక్కడికక్కడే వేరు చేయాల్సి ఉండగా పూర్తిస్థాయిలో సెగ్రిగేట్‌ చేయడం జరుగడం లేదు. రోజుకు 140 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తుండడంతో డంపింగ్‌యార్డు గుట్టగా మారి పోయింది. ఎండకాలం, చలికాలంలో డంపింగ్‌యార్డులో చెత్త అంటుకొని వెలువడే పొగ, దుర్వాసన భరించలేక సమీప ప్రాంతాల ప్రజలే కాకుండా రాజీవ్‌రహదారి నుంచి వెళ్ళే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్‌సిటీలో రూ.16 కోట్లతో బయోమైనింగ్‌ ప్రారంభించినా కొన్నాళ్లకు నిలిచి పోయింది. బయోమైనింగ్‌ను పూర్తిస్థాయిలో చేయించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరముంది.

ప్రతిరోజు తాగునీరు అందేనా..

ఎల్‌ఎండీలో నీటి వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికి నగరంలో ప్రతిరోజు మంచినీటి సరఫరా పూర్తిస్థాయిలో జరుగక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే విలీన గ్రామాలైన బొమ్మకల్‌, దుర్శేడ్‌, గోపాల్‌పూర్‌, మల్కాపూర్‌, లక్ష్మీపూర్‌, రేకుర్తి, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి తదితర ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపల్లిలోనూ తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన అవసరముంది. వీధి దీపాల నిర్వహణ పూర్తిగా గాలికి వదిలివేశారు. నగరంలోని ప్రధాన చౌరస్తాల్లో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన హైమాస్టు లైట్లతోపాటు ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, కాలనీల్లోని వీధి దీపాలు సగానికిపైగా వెలుగడం లేదు. ఇటీవల కొన్నింటిని బాగు చేయించినా ఇంకా చాలా చోట్ల రాత్రివేళల్లో చీకట్లతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలో దాదాపు 40 చోట్ల ఏర్పాటు చేసిన పార్కులు, ఓపెన్‌ జిమ్స్‌ నిర్వహణ సరిగా లేక ఆశించిన మేరకు ప్రజలకు ప్రయోజనం కలుగడం లేదు.

జంక్షన్లపై దృష్టి సారిస్తారా..

నగర సుందీరకరణలో భాగంగా తెలంగాణచౌక్‌, బస్టాండ్‌, వన్‌టౌన్‌, కమాన్‌, అంబేద్కర్‌ చౌరస్తా, జగ్జీవన్‌రామ్‌ చౌరస్తా, నాకా చౌరస్తా, కాపువాడ చౌరస్తాలను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసి వాటి నిర్వహణను పూర్తిగా మరిచిపోయారు. వీటిపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు నగరపాలక సంస్థ కార్యాలయంలో సిటిజన్‌ చార్టర్‌ ప్రకారంగా పౌరసేవలందక పోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు ఇస్తేగానే పనులు కావడం లేదని విమర్శలు, ఫిర్యాదులు ఉన్నాయి. సమస్యలను పరిష్కరించడంతోపాటు కార్పొరేషన్‌లో పారదర్శక సేవలందించేలా చూడాలని, ప్రత్యేక నిధులతో నగర అభివృద్ధిని కొనసాగించాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:47 AM