Share News

యువతకు ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రాధాన్యం

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:21 PM

జిల్లాలోని యువతకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రోత్సహించడం తోపాటు, చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను వెలుగులోకి తీసుకురావాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు.

యువతకు ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రాధాన్యం

పెద్దపల్లి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని యువతకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రోత్సహించడం తోపాటు, చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను వెలుగులోకి తీసుకురావాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అగ్నివీర్‌, ఎస్‌ఎస్‌సీ జీడీ అభ్యర్థుల కోసం నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరం, మన జిల్లా మన ఖిల్లా కార్యక్రమంలో భాగంగా సీతమ్మలొద్ది ట్రెక్కింగ్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. నవంబర్‌ 12 నుంచి ప్రారంభం కానున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులతోపాటు ఎస్‌ఎస్‌సీ జీడీ అభ్యర్థులకు ప్రయోజనం కల్పించేలా యువశక్తి పెద్దపల్లి ఆధ్వర్యంలో ఈ నెల 31న ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, శిబిరంలో పాల్గొనదలచిన అభ్యర్థులు పోస్టర్‌లోని క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని, వివరాలకు 7780543055, 9182691655 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

1న సీతమ్మలోద్ది ట్రెక్కింగ్‌

జిల్లాలోని చారిత్రక, ప్రకృతి ప్రదేశాల విశిష్టతను ప్రజలకు పరిచయం చేయడంతోపాటు యువతలో ఫిట్‌నెస్‌, పర్యావరణ పరిరక్షణపై ఆసక్తిని పెంపొందించేందుకు మన జిల్లా మన ఖిల్లా కార్యక్రమంలో భాగంగా నవంబరు 1న సీతమ్మలొద్ది ప్రాంతంలో ట్రెక్కింగ్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. చారిత్రక ప్రదేశాల పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరుతున్నారని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా యువతలో చైతన్యం తీసుకురావడంలో భాగంగా సీతమ్మలోద్ది ట్రెక్కింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. డీఎంఓ ప్రవీణ్‌ రెడ్డి, మాజీ సైనికుడు, అంతర్జాతీయ పర్వతారోహకుడు లెంకల మహిపాల్‌ రెడ్డి, ఫొటోగ్రాఫర్లు రవీందర్‌ రెడ్డి, శీలం అనిల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 11:21 PM