Share News

సామాన్యుడిపై ధరాఘాతం..

ABN , Publish Date - May 17 , 2026 | 12:50 AM

పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం ప్రభావం పేద, మధ్యతరగతి కుటుంబాలను వెంటాడుతూనే ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సతమతమవుతున్న కుటుంబాలకు పెట్రోల్‌, డీజిల్‌ మంట అంటుకుంది. యుద్ధ ప్రభావంతో గ్యాస్‌ భారం మోస్తున్న సామాన్యుల బతుకు బండిపై కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత భారాన్ని పెంచింది.

సామాన్యుడిపై ధరాఘాతం..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం ప్రభావం పేద, మధ్యతరగతి కుటుంబాలను వెంటాడుతూనే ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సతమతమవుతున్న కుటుంబాలకు పెట్రోల్‌, డీజిల్‌ మంట అంటుకుంది. యుద్ధ ప్రభావంతో గ్యాస్‌ భారం మోస్తున్న సామాన్యుల బతుకు బండిపై కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత భారాన్ని పెంచింది. కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయని సంకేతాలు ఇస్తున్నట్లుగానే పెట్రోల్‌ లీటరుకు రూ 3.39, డీజిల్‌పై రూ 3.27 పెంచింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల మూగిసే వరకు ఆగిన పెట్రోల్‌ ధరలు ఒక్కసారిగా పెరగడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 78 వరకు వివిధ చమురు కంపెనీలకు సంబంధించిన పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటి ద్వారా జరిగే పెట్రోల్‌ డీజిల్‌ విక్రయాలపై తాజాగా పెరిగిన చమురు వారం ప్రతినెల దాదాపు రూ 5 కోట్ల వరకు వాహనదారులు భరించాల్సి ఉంటుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న పనికి సామాన్య కుటుంబాల వరకు వాహనాలను వినియోగిస్తున్నారు. చిన్న, పెద్ద దానికి అనే తేడా లేకుండా ఎక్కడికి వెళ్లాలన్నా వాహనాలు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.111.43 డీజిల్‌ ధర రూ 99.50కి పెరిగింది. దీంతో సామాన్యుడు జేబుకు ఉన్నఫలంగా చిల్లులు పడే పరిస్థితి ఏర్పడింది.

పేదోళ్లకు నిత్యావసరాలు భారమే..

యుద్ధం ప్రభావం అనేక రంగాలపై ప్రభావం చూపుతూ నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కువగా నేత కార్మికులు, వ్యవసాయ కూలీలు, దినసరి కూలీలు ఉన్నారు. వీరికి కొద్దిపాటిగా ధరలు పెరిగితేనే కష్టంగా మారుతుంది. ఇప్పటికే ఉప్పు, పప్పులు, నూనెలు, రోజూ వాడే వంట సామగ్రి ధరలు పెరిగాయి నూనెల ధర ఏకంగా రూ.190 వరకు పెరిగింది. మిగతా నిత్యావసర సరుకులు ధరలు కూడా బిల్లింగ్‌ వైపు చూస్తేనే సామాన్యులు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఈక్రమంలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో రవాణా రంగంపై భారీగా ప్రభావం చూపుతోంది. రవాణా చార్జీలు పెంచడం ద్వారా నిత్యావసర సరుకులు కూడా పెరగనున్నాయి. కూరగాయలతో పాటు మాంసం, పండ్లు ఒక్కటేమిటి అన్ని నిత్యావసరాల ధరలు పెరగడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. యుద్ధంతో ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులు చార్జీలు, సుంకాలు పెరిగాయి. వీటి ప్రభావంతో కూడా ధరలు పెరిగాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత భారాన్ని పెంచుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ప్రైవేట్‌ ప్రయాణ చార్జీలకు రెక్కలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, ముంబాయి, చెన్నై.. ఇలా వివిధ ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగాలు, మరోవైపు సిరిసిల్ల కేంద్రంలోని వస్త్ర వ్యాపారులు వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల ప్రభుత్వ రంగం, ప్రైవేట్‌ రంగ రవాణా వ్యవస్థలపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రధానంగా ప్రైవేట్‌ రవాణా వ్యవస్థలను జిల్లా ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తారు. చమురు ధరల పెరుగుదలతో రవాణా చార్జీలకు రెక్కలు వస్తున్నాయి. ట్రాన్స్‌పోర్ట్‌ వాహనదారులు కూడా ధరలు పెంచేస్తున్నారు. ఇంధనంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న రంగాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది.

రైతులపై మరింత భారం

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపైనే ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోనే పెట్రోల్‌, డీజల్‌ ధరలు పెరుగుదల రైతులపై భారాన్ని మోపనుంది. రైతులు దుక్కులు దున్నడం, పొలం పనులకు వాహనాలను ఉపయోగిస్తున్నారు. స్ర్పెయింగ్‌, కలుపుతీత, కోతలు కోయడం వంటి పనులే కాకుండా ధాన్యాన్ని తరలించే వరకు వాహనాలను వినియోగిస్తున్నారు. డీజిల్‌ ధర పెరగడంతో రైతులకు ఎకరానికి అదనంగా మరో రూ.3 వేల వరకు అదనపు భారం పడనుంది. ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుదలపై ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 17 , 2026 | 12:50 AM