‘పరిషత్’ ఎన్నికలకు కసరత్తు
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:37 AM
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిపోగా ‘పరిషత్’ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న క్రమంలో ఎన్నికల కమిషన్ అకస్మాత్తుగా ఓటర్ జాబితాలపై దృష్టి సారించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఆశావహులకు ఆశలు మొదలయ్యాయి. పల్లెల్లో మరోసారి జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు సన్నాహాలు మొదలైనట్లు భావిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిపోగా ‘పరిషత్’ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న క్రమంలో ఎన్నికల కమిషన్ అకస్మాత్తుగా ఓటర్ జాబితాలపై దృష్టి సారించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఆశావహులకు ఆశలు మొదలయ్యాయి. పల్లెల్లో మరోసారి జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు సన్నాహాలు మొదలైనట్లు భావిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ దిశగానే ఎన్నికల కమిషన్ ఓటర్ జాబి తాల పరిశీలన, సరిచేయడం, మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2024 జులై 3న ఎంపీటీసీ, జులై 4న జడ్పీటీసీ సభ్యు ల పదవీకాలం ముగిసింది. దాదాపు రెండేళ్లు దగ్గర పడుతున్న క్రమంలో పంచాయతీ ఎన్నికలతో పాటే పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహిస్తారని భావించారు. పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంతో గ్రామాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ పడడానికి సిద్ధమైన ఆశావహులకు నిరాశ ఎదురైంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఓటర్ జాబితాలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టడంతో పల్లెల్లో మళ్లీ ఆశావహుల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందిన అదనపు ఓటర్ల జాబితాను మండలాల వారీగా విభజించి, గ్రామపం చాయతీ వార్డులకు మ్యాపింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఓటర్లు గ్రామంలోని వార్డు పరిధిలోని పోలింగ్ స్టేషన్‌కు అనుసంధానం చేయాలని పేర్కొంది. ఇందుకోసం టెల్ -పోల్ సాప్ట్ వేర్ ద్వారా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది మ్యాపింగ్ చేసి న తర్వాత జిల్లా స్థాయి అధికారులు ధ్రువీకరించి పోలీస్‌స్టేషన్లకు లింక్ చేయాలని ఆదేశాల ఇచ్చింది. ఓటర్ జాబితా సరిచేయడం, పోలీస్ స్టేషన్, వార్డుల మ్యాపింగ్ ప్రక్రియను ఏప్రిల్ 23వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో త్వర లోనే పరిషత్ ఎన్నికలు జరుగుతాయనే చర్చ మొదలైంది
ఆశావహుల సందడి
ప్రభుత్వం గతంలో జడ్పీటీసీల, ఎంపీపీలు, స్థానాలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు నిలిపివేయడంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కోర్టు ఉత్తర్వుల మేరకే రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీ, మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించి నట్లే పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు అధిక స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించ నున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 జడ్పీటీసీలు, 12 ఎంపీపీలు, 123 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా సరి చేయాలని సర్క్యులర్ రావడం పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఆశావహులు ప్రజలతో మమేకం కావడానికి పల్లెల్లో పలకరింపులు మొదలు పెట్టారు. పెద్దల వద్దకు వెళ్లి మద్దతు కూడగట్టుకుం టున్నారు. కుల సంఘాలు. యువజన సంఘాలు. మహిళా సంఘాలతో సమాలోచనలు చేస్తున్నారు. జడ్పీటీసీల ఆశావహులు ఊరూరా తిరుగుతూ యో గక్షేమాలను పలకరిస్తూ ఆర్థిక సహాయం అం దించడానికి ముందుకు వస్తున్నారు.
రిజర్వేషన్లపై ఆసక్తి
జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్‌ల రిజర్వేషన్లపై మళ్లీ ఆసక్తి మొదలైంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్లు మళ్లీ పాత పద్ధతిలోనే రానున్నాయి. 50 శాతంలోపు రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉండే విధంగా నిర్ణయం తీసుకోనున్నారు. మిగిలిన జనరల్‌కు కేటాయించిన ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీలు కూడా బీసీలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయించే విధంగా ప్రకటనలు చేస్తున్నాయి. 2019 రిజర్వేషన్ల ప్రకారం జిల్లాలో 12 జడ్పీటీసీ స్థానాల్లో ఒకటి ఎస్టీ మహిళ, ఒకటి ఎస్సీ మహిళ, రెండు ఎస్సీ జనరల్, ఒకటి బీసీ మహిళ, ఒకటి బీసీ జనరల్, మూడు జనరల్ మహిళ, మరో మూడు జనరల్‌లకు కేటా యించారు. రిజర్వేషన్ల ప్రకారం ఆరు మహిళలకు, ఆరు జనరల్‌గా ఉన్నాయి. 123 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 68 మహిళలకు 58 జనరల్‌కు కేటాయిం చారు. ఇందులో ఎస్టీలకు ఆరు కేటాయించగా 5 మహిళలకు, ఒకటి జనరల్‌గా ఉంది. 28 ఎస్సీలకు కేటాయించగా 17 మహిళలకు, 11 జనరల్, 25 బీసీలకు కేటాయించగా 14 మహిళలకు, 11 జనరల్ స్థానాలుగా ఉన్నాయి. 64 జనరల్ స్థానాలు ఉండగా 29 మహిళలకు, 25 జనరల్‌గా కేటాయించారు. ఈసారి బీసీ డెడికేషన్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. జిల్లాలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధంగా ఉండడంతో నోటిఫికేషన్ రావడం తరువా యిగా ఎన్నికల నిర్వహణ ముందుకు సాగనుంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 3.53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1.70 లక్షలు. మహి ళలు 1.82 లక్షల మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహ ణకు అధికార యంత్రాంగం ఇప్పటికే పోలింగ్ కేంద్రా లు, పోలింగ్ సామగ్రిని సిద్ధం చేసింది. 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 712 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు కూడా గతంలో చేశారు.
జిల్లాలో పరిషత్ ఓటర్లు
మండలం పురుషులుమహిళలు మొత్తం
బోయిన్‌పల్లి 14753 1572 30505
చందుర్తి 13445 14649 28094
ఇల్లంతకుంట 19644 20902 40546
గంభీరావుపేట 17811 18996 36807
కోనరావుపేట 17180 18045 35225
ముస్తాబాద్ 18658 19842 38500
రుద్రంగి 6454 7208 13665
తంగళ్లపల్లి 19395 20683 40079
వీర్నపల్లి 5769 5958 11727
వేములవాడ 8953 9523 18492
వేములవాడరూరల్ 9020 9805 18825
ఎల్లారెడ్డిపేట 19690 21196 40886
మొత్తం 170772 182559 353351