కొనుగోళ్లకు సన్నాహాలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:57 AM
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యేటా వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండడం, ఆశించిన స్థాయిలో సాగునీరు అందడంతో వరి సాగు రైతుల సంఖ్య యేటా పెరుగుతూ వస్తోంది.
జగిత్యాల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యేటా వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండడం, ఆశించిన స్థాయిలో సాగునీరు అందడంతో వరి సాగు రైతుల సంఖ్య యేటా పెరుగుతూ వస్తోంది. గత యాసంగితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం పెరగడంతో ధాన్యం కొనుగోలుకు అధికారులు అదే తరహాలో సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ తొలి, మలి వారాల్లో పంట చేతి కొచ్చే సమయం కావడంతో రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇటీవల జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
సమస్యల పరిష్కారంపై దృష్టి..
జిల్లాలో యాసంగిలో 505 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఐకేపీ, సహకార సంఘాలు, మెప్మా ఆద్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది అందుబాటులో లేకపోవడం, తేమ పేరుతో ధరలు తగ్గించడం ఇతరత్రా సమస్యల పరిష్కారంపై సైతం అధికారులు దృష్టి సారిస్తున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం..
జిల్లాలో 2021-22 యాసంగి సీజన్‌లో వరి 2,70,540 ఎకరాల్లో, 2022-23 యాసంగి సీజన్‌లో 2,80,706 ఎకరాలు, 2023-24 సీజనలో 2,95,059 ఎకరాలు, 2024-25 సీజనలో 2,97,498 ఎకరాలు, 2025-26 సీజనలో 2,98,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. గత యాసంగి సీజనలో జిల్లాలో సుమారు 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుత 2025-26 యాసంగి సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సుమారు 1.25 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని అంచనా ఉంది. ఇందుకుగానూ ఇప్పటికే పౌరసరాఫరా శాఖ వద్ద సుమారు 80 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయంటున్నారు. అవసరమైన సమయంలో మరిన్ని గన్నీ బ్యాగులను తెప్పిండానికి నిర్ణయించారు. ధాన్యం కుప్పలపై కప్పడానికి సుమారు 17 వేల టార్పాలిన్లు సైతం అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న కేంద్రాల్లో సుమారు 505 ప్యాడీ క్లీనర్లు, సుమారు 770 తేమను పరిశీలించే యంత్రాలు, సుమారు 960 ఎలకా్ట్రనిక్ కాంటాలు అందుబాటులో ఉంచనున్నారు.
మౌలిక వసతుల కల్పన...
ప్రతీ కొనుగోలు కేంద్రంలో మౌలిక వసతులైన నీడ, మంచినీరు, తాత్కాలిక టాయిలెట్స్ సమకూర్చడంపై అధికారులు దృష్టి సారించారు. విద్యుత్ కనెక్షన్, ఆన్‌లైన్ వసతి ఉండడంతో పాటు ప్రతి ఒక్క అధికారి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో రెండు ప్యాడి క్లీనింగ్ మిషిన్స్ అందుబాటులో ఉంచుతున్నారు. రైతులకు సరిపడా టార్పాలిన్లు , ఏ రోజుకు ఆ రోజు నాణ్యతను పరిశీలించి రికార్డు చేసే విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
93 పారాబాయిల్డ్ రైస్‌మిల్లుల భాగస్వామ్యం...
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్‌లో 93 పారా బాయిల్డ్ రైస్ మిల్లులు కొనుగోలులో భాగస్వామ్యం కానున్నాయి. ప్రతీ రైస్ మిల్లులో సుమారు 50 నుంచి 60 మంది హమాలీలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మిల్లర్లకు అధికారులు సూచించారు. ఎప్పటికప్పుడు మిల్లుకు వచ్చిన లారీని అన్‌లోడ్ చేసి త్వరగా దిగుమతి జరిగేలా చూడాలని సూచించారు. అదేవిధంగా ధాన్యం అప్పగించడానికి మిల్లర్ల నుంచి ముందస్తుగానే బ్యాంక్ గ్యారెంటీలు స్వీకరించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగునంగా మిల్లర్లకు అధికారులు సూచనలు ఇచ్చారు.
కొనుగోళ్ల ఏర్పాటుపై దృష్టి..
రానున్న రెండు, మూడు రోజుల్లో పలు ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సలహాలు, సూచనలు అందించడానికి కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత సైతం జిల్లా కేంద్రంలో జిల్లా సివిల్ సప్లయి అధికారులు, జిల్లా సివిల్ సప్లయి మేనేజర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా సహకార శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా సహాయ లేబర్ కమిషనర్, జిల్లా తూనికలు కొలతలు శాఖ, జిల్లా రవాణా శాఖ అధికారులతో ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోళ్లపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లు, జిల్లా లారీ ట్రాన్స్ పోర్టు ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని నిర్ణయించారు. హార్వేస్టర్ యజమానులతో అదనపు కలెక్టర్ బీఎస్ లత, సివిల్ సప్లయి, వ్యవసాయ, రవాణా శాఖ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించడానికి నిర్ణయించారు.
పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు..
- జితేంద్రప్రసాద్, సివిల్ సప్లయి కార్పొరేషన జిల్లా మేనేజర్
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా జరపడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము. ప్రతీ రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ధాన్యం కోతలు ప్రారంభం అయ్యే లోపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాము.