Share News

ప్రధానపార్టీల ముందస్తు సర్వేలు

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:28 AM

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు రేపోమాపో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి. జిల్లాలోని అయిదు మున్సిపాలిటీలు, 136 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నా యి.

 ప్రధానపార్టీల ముందస్తు సర్వేలు

జగిత్యాల, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు రేపోమాపో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి. జిల్లాలోని అయిదు మున్సిపాలిటీలు, 136 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నా యి. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లాలో త్రిముఖ పోటీ ఉంటుందని పార్టీలు భావిస్తున్నాయి. జిల్లాలో ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు పార్టీలు సర్వే బాట పట్టాయి. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల వారీగా కుల సమీకరణాలు, ఇతరత్రా ప్రభావితం చేయనున్న వర్గాలు, వివిధ అంశాల వారీగా అభిప్రాయాలు సేకరించేందుకు ముందస్తు సర్వేలు చేయిస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ గుట్టుగా సర్వేలు చేయిస్తుండగా, మరోవైపు ఆశావహులు సైతం వేర్వేరుగా సర్వేలు చేయించుకుంటున్నారు. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, రాయికల్‌ మున్సిపాలిటీల పరిధితో పాటు ధర్మపురి మున్సిపాలిటీలో సైతం గుట్టుగా సర్వేలు జరుగుతున్నాయి.

గెలుపే లక్ష్యంగా కసరత్తులు...

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు అన్నిపార్టీలకు సవాల్‌గా మారింది. కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. అదే ఊపుతో మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించుకోవడంపై దృష్టి సారించింది. గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు నిర్వహించిన విధంగానే తమ ఏజెన్సీల ద్వారా సర్వేలను కొనసాగిస్తోందని తెలుస్తోంది. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లో పలువురి వద్ద ప్రధాన పార్టీలకు చెందిన ఏజెన్సీలు వివరాలు సేకరిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీలు సైతం తమ తమ ఏజెన్సీలు, తమ అనునాయులతో సర్వేలు నిర్వహిస్తున్నాయి.

ఓటర్ల నాడిని తెలుసుకొని...

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి పట్టణాల్లో ప్రజలు ఏ వైపు ఉన్నారో... వారి నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఏ అంశాలు కీలకంగా మారనున్నాయి...గల్ఫ్‌కు వెళ్లిన కుటుంబాల సభ్యులు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు.. బీడీ కార్మికులు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు.. మహిళా సంఘాల స్పందన ఎలా ఉంది...కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు ఎటు మొగ్గు చూపుతున్నారు..ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏ పార్టీపై ఎంత వరకు ప్రభావం చూపనుంది...మైనార్టీ ఓటర్లు మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించే వైఖరి ఎలా ఉండనుంది...యువత, మహిళల మొగ్గు ఎటు వైపు ఉండనుంది తదితర వివరాలు సేకరిస్తున్నారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ఎంత...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు వర్గాలకు చెందిన ప్రజల కోసం అమలు చేస్తున్న అభివృదింధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రభావం చూపుతాయా తదితర అంశాలను సర్వేలో పరిశీలిస్తున్నారు. జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో వివిధ వర్గాల వారీగా వివరాలను సేకరిస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన ఏజెన్సీలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నిఘా ఏజెన్సీలు సైతం ఆయా ప్రాంతాల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నాయి. దీనికి తోడు మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు సైతం సొంతంగా సర్వేలు చేయించుకుంటూ గెలుపు ఓటములపై అంచనాలు వేసుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు, ఆశావహులు గుట్టుచప్పుడు కాకుండా సర్వేలు, మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలను అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు.

Updated Date - Jan 10 , 2026 | 12:28 AM