పీఆర్సీ, డీఏలు వెంటనే చెల్లించాలి
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:13 AM
రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి డీఏలు, పెండింగ్ బిల్లులను చెల్లించాలని మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు ధర్నా నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, జూలై14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి డీఏలు, పెండింగ్ బిల్లులను చెల్లించాలని మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ముస్కుల్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందులో ప్రధానంగా ఆరు డీఏలు తదితర సమస్యలను ప్రస్తావించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేయక తప్పదని వారు హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల కోసం ఈ-కుబేర్‌లో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను చెల్లించాలన్నారు. ఎస్‌ఎస్‌ఏ మహిళా ఉపాధ్యాయులు, సిబ్బంది సమ్మె కాలపు జీతం చెల్లిస్తూ, ఎంటీఎస్‌ను అమలు చేయాలన్నారు. మాడల్ స్కూల్ 010 పద్దు విషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాలన్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు 2003 డీఎస్సీ వారికి ఓపీఎస్ అమలు చేయాలని, సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఎస్‌ఎల్పీ వెనక్కి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మెనిఫోస్టోను అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, జూన్ రెండు నుంచి హెల్త్ కార్డులు అమలు చేస్తామని చెప్పి మే నెలలో జీతాల వాటా కోత విధించారన్నారు. ట్రస్టు ఏర్పాటు అసంబద్దంగా ఉందని, జాయింట్ స్టాఫ్‌కౌన్సిల్‌లో అన్ని సంఘాలు ట్రస్టులో ఉండాలనే మార్గదర్శకాలు పూర్తయిన తర్వాతనే వాటా కట్ చేయాలన్నారు. ఉపాధ్యాయలు వార్షిక ప్రమోషన్ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. లేనియెడల ఆగస్టు 1న మహాధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గుండవేని జగన్, రాష్ట్ర బాధ్యులు ఎలగం కనకయ్య, జైపాల్ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి, జిల్లా మహిళా ప్రముఖ్ మంజుల, డివిజన్ ఇంచార్జులు లింగం శ్రీనివాస్, రమేష్, జిల్లా బాధ్యులు కటకం ప్రకాష్, నరేష్, పవన్, సతీష్, శశిదర్, ఐలయ్య, జితేందర్, సురేందర్ పాల్గొన్నారు.