రిజర్వేషన్ల ఖరారుతో వేడెక్కిన రాజకీయాలు
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:38 PM
మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వార్డుల సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధులు సైతం మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తాను చాటుకోవటానికి రాజకీయ వ్యూహాత్మాకంగా వ్యవహరిస్తున్నారు.
మంథని, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వార్డుల సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధులు సైతం మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తాను చాటుకోవటానికి రాజకీయ వ్యూహాత్మాకంగా వ్యవహరిస్తున్నారు. మంథని మున్సిపల్ చైర్మన్ బీసీ జనరల్‌గా, 13 వార్డుల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్, మహిళ కేటగిరిల్లో వార్డుల కేటాయింపు కావడంతో రాజకీయ సందడి ప్రారంభమైంది. చైర్మన్, కౌన్సిలర్ల రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఉత్సాహంగా అనుకూలించని వారు నిరుత్సాహ పడ్డారు. ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ఘటం కొలిక్కిరావడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల్లో నేతలు పావులు కదుపుతున్నారు. బీసీ జనరల్‌గా ఉన్న చైర్మన్, ఆయా వార్డుల్లో రిజర్వేషన్ల ప్రకారం కౌన్సిలర్ల అభ్యర్థుల కోసం అన్వేషణలు ప్రారంభించారు. పోటీ కోసం ఉత్సాహం చూపుతున్న వారిలో తమ పార్టీలో గెలిచే అవకాశం ఉన్న, ప్రత్యర్థి పార్టీలో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల గురించి ఆరా తీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తాను చాటుకోవటానికి చైర్మన్, కౌన్సిలర్ల అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తున్నారు. వార్డుల వారిగా తమ సమీకరణలు చూసుకుంటున్నారు. ఇరు పార్టీల నుంచి చైర్మన్ అభ్యర్థుల, కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లపై చర్చకొనసాగుతుంది. మరో వైపు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన అభ్యర్థులు తాను ఎన్నికల బరిలో ఉన్నానని.. తమను ఆశీర్వాదించాలని సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
అనుకూలించని రిజర్వేషన్లు
పక్క డివిజన్లు వెతుక్కుంటున్న ఆశావాహులు
కోల్‌సిటీ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ మేయర్ పీఠం ముచ్చటగా మూడోసారి ఎస్‌సీలకే దక్కింది. నగరపాలక సంస్థ ఏర్పడినప్పటి నుంచి కార్పొరేషన్ ఎస్‌సీలకు రిజర్వు అవుతోంది. ఈ సారి కూడా ఎస్‌సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. కార్పొరేషన్‌లో 60డివిజన్లు ఉండగా శనివారం డివిజన్ల రిజర్వేషన్‌ను ఖరారు చేశారు. 30సీట్లు ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు రిజర్వు చేశారు. మిగిలిన 30జనరల్‌కు కేటాయించారు. రిజర్వేషన్లను ఆర్థిక కుల గణన సర్వే, జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని కేటాయించారు. ఇందులో మహిళలకు సంబంధించి డ్రా ద్వారా ఆయా రిజర్వు కేటగిరిలు, జనరల్ నుంచి 50శాతం సీట్లను కేటాయించారు.
కీలక నేతలకు కలిసి రాని రిజర్వేషన్
రామగుండం నగరపాలక సంస్థలోని కీలక నేతలకు ఈ సారి రిజర్వేషన్లు కలిసి రాలేదు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ప్రాతినిధ్యం వహించిన 55వ డివిజన్ జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. అలాగే కాంగ్రెస్ నాయకుడు మహంకాళి గతంలో ప్రాతినిధ్యం వహించిన 8వ డివిజన్ ఎస్‌సీ మహిళకు రిజర్వు అయ్యింది. మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు ప్రాతినిధ్యం వహించిన డివిజన్ కూడా జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. కాగా చాలా మంది మాజీ కార్పొరేటర్లు, ఆశావాహులు తమకు డివిజన్ల రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో పక్క డివిజన్లపై దృష్టి పెట్టారు. మాజీ కార్పొరేటర్లు కొందరు కుటుంబ సభ్యులను పోటీ పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు పోటీకి విముఖత చూపుతున్నారు.
ఆశావాహుల్లో నిరాశ
పెద్దపల్లిటౌన్, (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సగం వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేయాలకున్న ఆశావాహుల్లో నిరాశ నెలకొంది. ఎమ్మెల్యే ఆశీస్సులున్న ఆశావాహులకు రిజర్వేషన్ అడ్డుకట్ట వేసింది, దీంతో ఇతర వార్డుల్లో టిక్కెట్టు కేటాయించాలని వేడుకుంటున్నారు. అయితే ఆయా వార్డుల్లో ఇప్పటికే పోటీ చేసే వారు ఖర్చు కూడా చేశారు. అధికార పార్టీ టిక్కెట్టు కేటాయించకపోయినా ఇండిపిండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే అదే వార్డుల్లో కూడా ఆశావాహులున్నారు. ఎన్నికల సంఘం నోటిఫికెషన్ విడుదల చేసిన తరువాత ఎమ్మెల్యే నిర్ణయంపై పోటీ చేసే వారి భవితవ్యం ఆధారపడి ఉంది.