Share News

కోల్‌బెల్ట్‌లో వేడెక్కిన రాజకీయాలు

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:11 AM

రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు సింగరేణిపైనే ఫోకస్‌ పెట్టాయి. సింగరేణి పరిరక్షణ పేరుతో బీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ సింగరేణిలో జరిగిన అవినీతిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లతో కార్మికుల్లో పట్టును సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొత్తగా పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత ఈ నెల 15 నుంచి ఐదు రోజులపాటు బాయిబాట పేర సింగరేణిలో పర్యటించనుంది.

 కోల్‌బెల్ట్‌లో వేడెక్కిన  రాజకీయాలు

గోదావరిఖని, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు సింగరేణిపైనే ఫోకస్‌ పెట్టాయి. సింగరేణి పరిరక్షణ పేరుతో బీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ సింగరేణిలో జరిగిన అవినీతిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లతో కార్మికుల్లో పట్టును సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొత్తగా పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత ఈ నెల 15 నుంచి ఐదు రోజులపాటు బాయిబాట పేర సింగరేణిలో పర్యటించనుంది. అనేక ఆరోపణలు, ఒత్తిళ్లలో సింగరేణి యాజమాన్యం సతమతమవుతోంది. సింగరేణిలోని వాస్తవాలను బయటపెట్టలేక ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ముందుకు నడవలేక నానా యాతన పడుతోంది. ఇదిలా ఉండగా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసు జారీ చేసింది. ప్రభుత్వమే చొరవ తీసుకొని సింగరేణిలోని సమస్యలకు పరిష్కారం చూపాల్సిన అనివార్యం నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే హడావుడిగా మెడికల్‌ అన్‌ఫిట్‌ అయి వీటీసీ ట్రైనింగ్‌లో ఉన్న డిపెండెంట్‌లో 400మందికి ఈ నెల 13న నియామక పత్రాలు అందజేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రూ.50వేల కోట్ల మొండి బకాయిలు సింగరేణి ఆర్థిక మూలాలను బలహీనపరిచింది. జెన్‌కో, ట్రాన్స్‌కో లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన భారీ మొత్తం ఏళ్ల తరబడి బకాయిగా ఉండటంతో ఈ భారాన్ని సింగరేణి మోసే పరిస్థితి లేదు. దీనికి తోడు సింగరేణి వద్ద ఉన్న ఆరువేల కోట్ల ఫిక్స్‌ డిపాజిట్లు మెల్లగా కరిగిపోయాయి. పైగా సుమారు 5000 కోట్ల రూపాయల ఓడితో సింగరేణి తన మనుగడ సాగిస్తున్నది. మార్కెట్లో ఏర్పడిన ఒత్తిడిని ఎదుర్కొలేని పరిస్థితుల్లో వార్షిక ఉత్పత్తిని తగ్గించుకొని మార్కెట్‌ను కాపాడుకునే ప్రయత్నంలో యాజమాన్యం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఇదే సందర్భంలో గతంలో ప్రతిపాదించి ఒప్పందాలు చేసుకున్న సోలార్‌, థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల వ్యవహారం కూడా సింగరేణికి ఇప్పుడు గుదిబండలాగా మారింది. ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించిన పీపీఏ చేసుకోవడం ఇప్పుడు సింగరేణికి గగనమే. జైపూర్‌లో 800మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సన్నద్ధమైనప్పటికీ ప్రభుత్వం నుంచి పీపీఏ లేకపోవడంతో అగమ్యగోచర పరిస్థితి నెలకొన్నది. నైనీ బ్లాక్‌ నుంచి బొగ్గు ఉత్పత్తి చేసినప్పటికీ కొనుగోలుదారులు లేకపోవడం, రవాణా మార్గాలను ఏర్పాటు చేసుకోకపోవడంతో రెండేళ్లుగా ఎలాంటి ఆదాయం లేకుండా పోయింది. రాజస్థాన్‌లో థర్మల్‌, సోలార్‌ ప్రాజెక్టుల ఒప్పందం కూడా నిలబడే పరిస్థితి లేదు. ఆ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అయ్యే మూడు వేల మెగావాట్ల కరెంటుకు కొనుగోలు ఒప్పందాలు ఇప్పటికీ జరగలేదు. ఇన్ని రకాల గందరగోళాల మధ్య సింగరేణి అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నది. నైనీ బ్లాక్‌ టెండర్ల రద్దు, సెంట్రల్‌ విజిలెన్స్‌ ఎంక్వయిరీ లాంటి పరిణామాలు యాజమాన్యానికి తలనొప్పిగా మారాయి. ఇప్పుడు ఎక్స్‌ప్లోరేషన్‌టెండర్లలో, శ్రీరాంపూర్‌ ఓబీ కుంభకోణం ఆరోపణలు సంస్థకు అదనపు తలనొప్పిగా తయారయ్యాయి. సోలార్‌ టెండర్ల విషయంలో కూడా సింగరేణి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఏడాదిగా మెడికల్‌ బోర్డు నిర్వహించకపోవడం, వారసత్వ ఉద్యోగాల కల్పన సింగరేణిలో నిలిచిపోవడంతో కార్మికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సంస్థలో అదనపు కార్మికులు భారంగా మారారని యాజమాన్యం వ్యాఖ్యలు చేయడం అనేక అపోహలకు దారితీసింది. సింగరేణిలో మళ్లీ గోల్డెన్‌ షేక్‌హ్యాండ్‌ వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు మాసాలుగా దుబారాలను తగ్గించడం, ఉత్పత్తిని తగ్గించుకోవడం, మల్టీ డిపార్ట్‌మెంట్‌ కమిటీల ద్వారా ఉత్పత్తి ఉత్పాదకతలను రక్షణ విషయాలను కార్మికులకు పునఃశ్చరణ చేసే కార్యక్రమాలు తీసుకున్నది. అయితే విధానపరమైన అంశాల విషయంలో యాజమాన్యం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీంటికి రాజకీయ కారణాలే నేపథ్యాలుగా కనిపిస్తున్నాయి. సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ రాజకీయ పార్టీ తన ఆధిపత్యాన్ని ఎన్నికల్లో ప్రదర్శించగలుగుతుందో ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది. సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంత కార్మికవర్గం ఇక్కడి రాజకీయాల ప్రతిస్పందన మరో 20, 30 అసెంబ్లీ సెగ్మెంట్లపై ఉంటుంది. అందుకోసమే రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు సింగరేణిపై దృష్టి సారించాయి. సింగరేణిలో 49శాతం వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా ఇందులోకి లాగాయి. దీంతో యాజమాన్యంపై పరోక్షంగా మరింత ఒత్తిడి పెరిగింది. ఇటు ఉత్పత్తి ఉత్పాదకతలను, అటు ఆర్థిక ఒత్తిడిని, మరోవైపు కొత్త ప్రాజెక్టుల నిర్వహణ, కార్యాచరణలు, ఉద్యోగ కల్పన లాంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్న సింగరేణి రాజకీయ ఒత్తిళ్లతో తట్టుకోలేకపోతోంది.

విద్యుత్‌ సంస్థల నుంచి సింగరేణికి బకాయిపడిన వేల కోట్లను సింగరేణికి ఇప్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. సింగరేణి ఇప్పటికే బొగ్గు విద్యుత్‌ రంగాలలో ఉత్పత్తులు సాగిస్తున్నప్పటికీ మార్కెట్‌ ఒత్తిని తట్టుకొని నిలబడాలంటే బొగ్గు నుంచి గ్యాస్‌ మిథేన్‌, ఇతర ఉత్పత్తులను ప్రారంభించాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ పార్టీల వైఖరులు ఎలా ఉన్నా సింగరేణిని కాపాడుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. సింగరేణి లాభాల్లోకి రాకపోయినా నష్టాలబారిన పడకుండా ప్రభుత్వం, యాజమాన్యం దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఒక సానుకూలమైన నిర్మాణాత్మకమైన పాత్రను సింగరేణిపై పోషించాలి. లేని పక్షంలో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం కానుంది. యేటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాల పరంగా ఎనిమిది వేల కోట్ల రూపాయల సెస్‌లు, డివిడెండ్లు, పన్నుల రూపంలో సింగరేణి నుంచి పొందుతున్నాయి. అటు ప్రభుత్వాలను ఇటు వేలాది మంది కార్మిక కుటుంబాలను పారిశ్రామిక రంగ అభివృద్ధిని భుజానమోస్తున్న సింగరేణి సంస్థను కాపాడుకోవడం బాధ్యతాయుతమైన సంకల్పంగా మారాల్సిన అవసరం ఉన్నది.

Updated Date - Jun 14 , 2026 | 12:11 AM