జిల్లాలో రాజకీయ వేడి
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:09 AM
జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటుంది. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు, జమిలి ఎన్నికలు తథ్యమని సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు చురుకుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్‌ను గద్దె దించి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ, బీఆర్ఎస్ పావులు కదుపుతుంటే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల పేరిట ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటుంది. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు, జమిలి ఎన్నికలు తథ్యమని సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు చురుకుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్‌ను గద్దె దించి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ, బీఆర్ఎస్ పావులు కదుపుతుంటే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల పేరిట ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నది.
మహా పాదయాత్రతో బీజేపీ బల ప్రదర్శన
కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ నేతృత్వంలో బీజేపీ మహాపాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న నేపథ్యంలో లక్ష మందిని యాత్రలో పాల్గొనేలా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 23న యాత్ర జరుగనున్నది. రాజకీయంగా ఈ యాత్రతో బలప్రదర్శన చేసి ప్రజల్లో పట్టుసాధించి వచ్చే ఎన్నికలకు పునాదులు వేసుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం.. అరాచకాన్ని అంతం చేద్దాం అనే నినాదంతో బీజేపీ ప్రజల్లోకి ఈ యాత్రను తీసుకవెళ్తున్నది. కరీంనగర్ ఎంపీ స్థానంతోపాటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్న బీజేపీ ఈ పరిధిలో వచ్చే అన్ని అసెంబ్లీ స్థానాలపై కన్నేసింది. ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాన్ని ఈ పాదయాత్రకు తరలించి పార్టీ నిర్మాణాన్ని ఆయా ప్రాంతాల్లో బలోపేతం చేసుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నది.
భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లు
కరీంనగర్ జిల్లాలో పూర్వవైభవం పొందేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలను చేస్తున్నది. కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షను చేపట్టేందుకు ఇక్కడి నుంచే తరలి అరెస్టు అయిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని దీక్షా దివస్ పేరిట ఈనెల 29న భారీస్థాయిలో సభ నిర్వహించతలపెట్టింది. కరీంనగర్ శివారులో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఈసభలో ప్రసంగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న పార్టీ నేతలతో సన్నాహాక సమావేశాన్ని నిర్వహించి భారీ ఎత్తున జనాన్ని తరలించేందుకు దిశానిర్దేశం చేశారు.
ఇందిరమ్మ బీమా, కొత్త పింఛన్లతో కాంగ్రెస్
అధికార కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నది. సర్ పేరిట పెద్ద ఎత్తున ఓట్లను తొలగించి కేంద్రప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓటు చోరికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఇప్పటికే వివిధ స్థాయిలో ఆందోళనలు నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నది. కొత్త పింఛన్లను మంజూరు చేసి గ్రామగ్రామాన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ను అందిస్తున్నది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందిరమ్మ చీరెల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని కూడా విస్తృతంగా చేపడుతూ గ్రామస్థాయిల్లో ప్రజల్లో పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నది. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ కార్యక్రమాల తర్వాత రాజకీయ పరిస్థితులను సమీక్షించుకొని ఉమ్మడి జిల్లా పరిధిలో మరోసారి భారీ బహిరంగ సభను నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించేలా కార్యక్రమం రూపొందించుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మూడు రాజకీయ పార్టీల కార్యక్రమాలతో నిండు చలికాలంలో వేడి రాజుకుంటున్నది.