అభివృద్ధి పనులకు రాజకీయ గ్రహణం
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:59 AM
నగరపాలక సంస్థకు అర్బన ఇనఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) నిధుల నుంచి 50 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు రాజకీయ గ్రహణం పట్టింది. నగరపాలక సంస్థలో కొత్తగా విలీనమైన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు ఈ నిధులను మంజూరు చేశారు.
కరీంనగర్ టౌన, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థకు అర్బన ఇనఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) నిధుల నుంచి 50 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు రాజకీయ గ్రహణం పట్టింది. నగరపాలక సంస్థలో కొత్తగా విలీనమైన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు ఈ నిధులను మంజూరు చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 87 అభివృద్ధి పనులను చేపట్టేందుకు గత సంవత్సరం అక్టోబరు 25న సీడీఎంఏ పరిపాలన అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనవరి 17న ఆనలైనలో టెండర్లను నిర్వహించారు. ఆ టెండర్లను ఖరారు చేసి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ (ఎల్‌ఓఏ)ని కాంట్రాక్టర్లకు ఇవ్వలేదు. 87 పనుల్లో 25 పనులకు కాంట్రాక్టర్లు బిడ్ దాఖలు చేయలేదు. మిగిలిన 62 పనుల్లో కొన్ని పనులకు సింగిల్ టెండర్లు దాఖలయ్యాయి. అంచనా రేట్ల కంటే దాదాపుగా అన్ని పనులకు లెస్ టెండర్లు దాఖలయ్యాయి. నిబంధనల మేరకు వచ్చిన టెండర్లను ఖరారు చేసి ఎల్‌ఓఏ ఇచ్చి పనులు ప్రారంభించి, మిగిలిన పనులకు తిరిగి టెండర్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ టెండర్ల వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీలు జోక్యం చేసుకోవడంతో అధికారులు కూడా ఎటూ తేల్చుకోలేక పోతున్నారనిన తెలిసింది. దీంతో టెండర్లు పూర్తయి రెండు నెలలుదాటినా పనులకు మోక్షం కలుగడం లేదు.
ఎటూ తేల్చుకోలేని స్థితిలో అధికారులు
మున్సిపల్ ఎన్నికలకు ముందే నిధులు మంజూరు కావడంతో ఎన్నికలైన వెంటనే పనులు జరుగుతాయని, తమ సమస్యలు కొంతమేరకైనా తగ్గుతాయని ప్రజలు ఆశించారు. ఈ టెండర్లను రద్దు చేసి తిరిగి అన్ని డివిజన్లలో పనులు జరిగే విధంగా నిదులు కేటాయించి టెండర్లు నిర్వహించాలని బీజేపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరోవైపు విలీన డివిజన్లతోపాటు నగరంలో ప్రధానమైన కొన్ని చోట్ల పనులు చేసేందుకు సీటీఎనలో పనులు చేర్చారని, నిబంధనల మేరకు షెడ్యూల్ దాఖలైన పనులకు ఎల్‌ఓఏ ఇచ్చి పనులు ప్రారంభించి, బిడ్ దాఖలు కానీ పనులకు తిరిగి టెండర్లు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఉంటే కమీషన్ల కోసమే టెండర్లు పూర్తయినా ఎల్‌ఓఏలు ఇచ్చి పనులు ప్రారంభించడం లేదని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో అధికారులు ఎటూ తేల్చుకోలేని స్థితిలో 87 పనులను పెండింగ్‌లోనే పెట్టారు. దీంతో విలీన డివిజన్లలో అభివృద్ధి పనులు జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు టెండర్లలో పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు దాఖలైన పనుల ఎల్‌ఓఏ ఇస్తే పనులు చేసేవాళ్లమని, ఇవ్వక పోవడంతో చేయలేకపోతున్నామని, దీనిపై త్వరగా అధికారులు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. నిధులు లేక గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం హామీ నిధులతో ప్రారంభించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు నిధులు మంజూరైనా పనులు చేయలేని స్థితి నగరపాలక సంస్థలో రాజకీయ జోక్యంతో నెలకొన్నది. అభివృద్ధి విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి పనులు వేగంగా జరిగేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, నిబంధనల మేరకు అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశమివ్వాలని ప్రజలు సూచిస్తున్నారు. విలీన డివిజన్లలో అనేక సమస్యలున్నందున అధికారులు ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకొని పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు.