రోడ్డు ప్రమాదబాధితులకు ‘పీఎం రహత్’
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:15 AM
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సదుపాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ పథకం అమలు చేస్తున్నది. ప్రమాదం జరిగినప్పుడు అత్యంత కీలకమైన తొలి గంటలోనే వైద్యం అందించి ప్రాణాలు రక్షించడంతోపాటు బాధిత కుటుంబంపై చికిత్స ఖర్చుల భారం తగ్గించేందుకు ఈ పథకం దోహదపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యం అందించనున్నారు.
జగిత్యాల, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సదుపాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ పథకం అమలు చేస్తున్నది. ప్రమాదం జరిగినప్పుడు అత్యంత కీలకమైన తొలి గంటలోనే వైద్యం అందించి ప్రాణాలు రక్షించడంతోపాటు బాధిత కుటుంబంపై చికిత్స ఖర్చుల భారం తగ్గించేందుకు ఈ పథకం దోహదపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యం అందించనున్నారు.
జిల్లాలో 30ఆసుపత్రుల్లో..
జిల్లాలోని 30ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు గరిష్టంగా రూ.1.50లక్షల వరకు, ఏడు రోజుల పాటు నగదురహిత వైద్యం అందిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తే చాలు అతడికి ఈ పథకం కింద అత్యవసర చికిత్స అందిస్తారు. ప్రమాదం జరిగిన క్షణం నుంచి ఏడురోజుల వరకు అయ్యే అన్నిరకాల అత్యవసర వైద్యఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఆర్థికఇబ్బందుల కారణంగా బాధితులకు ఆసుపత్రులు వైద్యం నిరాకరించకూడదన్నదే ఈ పథకం ప్రధానలక్ష్యంగా నిర్ణయించారు. కాగా జిల్లాలో ఆరోగ్యశ్రీ జాబితాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను నమోదు చేయాలని, ఆరోగ్యశ్రీ కింద ఎంప్యానల్ అయిన ఆసుపత్రులను పీఎం రహత్ పథకంలో చేర్చాలన్న డిమాండ్ ఉంది. అన్ని ప్రాథమికఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల బాధ్యులు ప్రతీఆసుపత్రి రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని పలువురు కోరుతున్నారు.
112నంబర్‌తో తక్షణ సాయం..
ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు, లేదా స్థానికులు 112హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్‌చేసి సమీపంలోని నెట్‌వర్క్ ఆసుపత్రుల వివరాలతో పాటు అంబులెన్స్ సదుపాయాన్ని పొందవచ్చును. పీఎం రహత్ పథకం అమలు మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుగుతుంది. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు అంతా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా సాగుతుంది. రాష్ట్ర ఆర్యోగసంస్థ ఆమోదం తెలిపిన పది రోజుల్లోనే ఆయా ఆసుపత్రులకు రోగికి సంబంధించిన బిల్లులు వస్తాయి.
పీఎం రహత్ పథకం సద్వినియోగం చేసుకోవాలి
- అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ, జగిత్యాల
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్యచికిత్స అందించి, వారి ప్రాణాలను కాపాడే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం రహత్ పథకంపై ప్రజలు అవగాహణ కలిగిఉండాలి. ప్రమాదబాధితులకు సకాలంలో చికిత్స అందించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చును. రోడ్డు ప్రమాదబాధితులకు సాయం అందించడానికి స్థానికులు మందుకురావాలి. ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్‌చేసి పోలీసుల సాయం పొందాలి.
బాధితులకు సత్వర వైద్యం
- గుజ్జుల సుజాత, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి, జగిత్యాల
రోడ్డు ప్రమాదబాధితులకు సకాలంలో వైద్య అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చును. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్ పథకం బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని ఎంపిక చేసిన ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యసేవలు అందించాలి. జిల్లాలోని 30ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు ప్రజలు ముందుకు రావాలి.