Share News

రైతుల గోస పట్టించుకోండి..

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:01 AM

రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు మాని రైతులు పడుతున్న కష్టాలను తీర్చాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఎన్‌టిపిసిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు సాగునీరు, విద్యుత్‌ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

రైతుల గోస పట్టించుకోండి..

జ్యోతినగర్‌, సెప్టెంబరు30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు మాని రైతులు పడుతున్న కష్టాలను తీర్చాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఎన్‌టిపిసిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు సాగునీరు, విద్యుత్‌ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా భూములు కొనడం, అమ్మడంపైనే శ్రద్ధ చూపుతోందని ఆరోపించారు. రైతుల సమస్యలను విస్మరించిందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో రైతులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఎంత నీరు ఉందో ప్రభుత్వానికి కనీస అవగాహన లేదన్నారు. అందుబాటులో ఉన్న నీటిలో కనీసం 10 టీఎంసీలను విడుదల చేస్తే లక్షల ఎకరాల పంట నష్టం జరగకుండా కాపాడవచ్చన్నారు. రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు పెరిగిపోయాయని ఈటల రాజేందర్‌ అన్నారు.

సింగరేణిని పరిరక్షించాలి...

సింగరేణి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఈటల రాజేందర్‌ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రూ.52,484 కోట్ల బకాయిలు ఉన్నాయని, వడ్డీతో కలిపి రూ. 70 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు సంబంధించిన పేర్ల మార్పు సమస్యను పరిష్కరించాలని కోరారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలను ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు. సింగరేణి కార్మికులతో చెలగాటమాడిన ఏ ప్రభుత్వాలు బతికి బట్టకట్టలేదని ఈటల రాజేందర్‌ అన్నారు. కార్మికులు, రైతుల సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 12:01 AM