పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
ABN , Publish Date - May 26 , 2026 | 11:40 PM
కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసన ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం మహాధర్నా చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి అడ్లూరి లక్ష్మన్ కుమార్ పాల్గొన్నారు.
ధర్మారం, మే 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసన ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం మహాధర్నా చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి అడ్లూరి లక్ష్మన్ కుమార్ పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన వెంటనే ధరలు పెంచడం వారి అసమర్ధ పాలనకు నిదర్శనమన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో సామాన్యులపై ప్రభావం పడుతుందని మండిపడ్డారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాముల్లో ధాన్యం మూలుగుతున్న రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. బీజేపీకి జైశ్రీరామ్ అనడం ఒక్కటే తెలుసని, రైతుల బాధలు, ఇబ్బందులు తెలియవని ఎద్దేవాచేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అరగంటకు పైగా ధర్నా చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి.
ధర్మపురిని కొప్పుల ఎందుకు అభివృద్ధి చేయలేదు.
సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలను అభివృద్ధి చేసినట్లు నీవెందుకు ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదో చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను అడ్లూరి ప్రశ్నించారు. 10 ఏళ్ళలో ఒక్క ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ను ఎందుకు కట్టించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కొప్పులకు టికెట్ ఇస్తారో ఇవ్వరో తెలియదు గాని, 2029లో నా తప్పు ఒప్పులను ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. తాను గెలిచిన తర్వాత ఆక్రమించిన ప్రభుత్వ భూములను తీసుకుంటానని చెప్పానని, బొమ్మరెడ్డిపల్లి, నర్సింగాపూర్, ఖిలావనపర్తిలలో భూములను స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. ఏఎంసీ చైర్మెన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగె లింగయ్య, పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, డీసీసీ సెక్రెటరీ కొత్త నర్సింహులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు యశోద అజయ్, సీనియర్ నాయకులు పాలకుర్తి రాజేశం, దేవి జనార్దన్, కాడె సూర్యనారాయణ పాల్గొన్నారు.