వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:20 AM
గణేష్ వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని, 25న నిర్వహించే గణేష్ నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు.
కోల్‌సిటీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గణేష్ వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని, 25న నిర్వహించే గణేష్ నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు, మత పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులతో సీపీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పండుగను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని, మండపాల నిర్వహణ, విగ్రహాల రవాణా, భక్తుల రద్దీ, నియంత్రణ, శోభాయాత్ర, నిమజ్జనం వరకు భధ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మండపాల వివరాలను సేకరించి, వాటిని పర్యవేక్షించేందుకు ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్ పోర్టులను తీసుకువచ్చామన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసే మండపాలు, విగ్రహం, వాహనాల ఎత్తు, నిర్వాహకుల వివరాలు, శోభాయాత్ర రూట్ ఆన్‌లైన్‌లో నమోదుచేయాలన్నారు. విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకుల వివరాలతో పోలీస్ స్టేషన్‌లో అనుమతి తీసుకోవాలని, ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్ ద్వారా ప్రతి మండపాన్ని జీయో ట్యాగింగ్ ద్వారా ఎస్‌హెచ్‌ఓలు పరిస్థితులను సమీక్షించేందుకు వీలు ఉంటుందన్నారు. మండపాల వద్ద 24గంటలు ఇద్దరు వ్యక్తులు ఉండాలని, మండపాల వద్ద లక్కిడ్రాలు నిర్వహించరాదని, బలవంతంగా చందాలు అడగకూడదని, విద్యుత్‌శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా డయల్ 112కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చట్టరీత్యా చర్యలు చేపడుతామని హెచ్చరించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్రగౌడ్, ఏసీపీలు వెంకటేశ్వర్లు, ప్రవీణ్ కుమార్, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ బీమేష్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ లు భూమేష్, చంద్రశేఖర్, సంధ్యారాణి పాల్గొన్నారు.