ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:55 PM
మున్సిపల్ ఎన్నికలలో జిల్లాలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఉదయం సందర్శించారు.
సుల్తానాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలలో జిల్లాలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఉదయం సందర్శించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఉద్యోగులకు అందించే సామగ్రి పంపిణీ అంశాన్ని కలెక్టర్ పరిశీలించి వారికి పలు సూచనలలు అందించారు. జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అథారిటీ అధికారి మున్సిపల్ కమిషనర్ టి రమేష్ నుంచి ఎన్నికలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. పలువురు రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలను పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతు జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలకు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌కు బుధవారం పోలింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. మొత్తం 124 వార్డులకు గాను రామగుండంలో ఒకటి ఏకగ్రీవం అయినందును మిగిలిన 123 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఈ వార్డులలో మొత్తం 470 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో కూడా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని, సమస్యాత్మకమైన కేంద్రాల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించామన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మంథని, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను మంగళవారం కలెక్టర్ సందర్శించి ఎన్నికల సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఆర్డీవోలు సురేష్, గంగయ్య, మున్సిపల్ కమిషనర్లు మనోహర్, వెంకటేష్, రమేష్‌లు పాల్గొన్నారు.