కారుణ్య నియామకాల అవకతవకలపై కలకలం...
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:44 PM
సింగరేణి కారుణ్య నియామకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని, అనవసర నియామకాలు చేశారని వస్తున్న అభియోగాలపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంటుందనే ప్రచారం సింగరేణిలో కలకలం సృష్టిస్తున్నది. గత ప్రభుత్వ కాలంలో మెడికల్ అన్‌ఫిట్ కేసుల్లో ఆరోగ్యంగా ఉన్న వారిని కూడా విధులకు అనర్హులుగా గుర్తిస్తూ వారసులకు ఉద్యోగాలు కల్పించారనే అభియోగాలు ఇప్పుడు సింగరేణిలో కల్లోల్లాన్ని కలిగిస్తున్నాయి.
గోదావరిఖని, మార్చి 26(ఆంధ్రజ్యోతి): సింగరేణి కారుణ్య నియామకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని, అనవసర నియామకాలు చేశారని వస్తున్న అభియోగాలపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంటుందనే ప్రచారం సింగరేణిలో కలకలం సృష్టిస్తున్నది. గత ప్రభుత్వ కాలంలో మెడికల్ అన్‌ఫిట్ కేసుల్లో ఆరోగ్యంగా ఉన్న వారిని కూడా విధులకు అనర్హులుగా గుర్తిస్తూ వారసులకు ఉద్యోగాలు కల్పించారనే అభియోగాలు ఇప్పుడు సింగరేణిలో కల్లోల్లాన్ని కలిగిస్తున్నాయి. ఏడాది క్రితం మెడికల్ బోర్డు అవినీతిపై జరిగిన ఏసీబీ, సింగరేణి విజిలెన్స్ ఎంక్వైరీల్లో కేసులు నమోదు కావడం, సింగరేణి వ్యాప్తంగా మెడికల్ అన్‌ఫిట్ కేసులన్నీ అవినీతితో జరిగాయని రాష్ట్రపతి వరకు దరఖాస్తు చేసుకోవడం సంచలనం సృష్టించింది. దీనికితోడు ఈ అంశంపై వచ్చిన ప్రశ్నకు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ఇవి ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, వీటిపై ఎలా నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా కారుణ్య నియామకాల పేర వారసులకు ఉద్యోగాలు కల్పించడం వల్ల సింగరేణిపై ఆర్థిక భారం పడుతుందని విశ్లేషిస్తున్నారు. 2014 నుంచి 2023వరకు సింగరేణిలో కారుణ్య నియామకాల పేర మెడికల్ అన్‌ఫిట్ జరిగిన వారు 13500లకుపైగా కార్మికులు ఉన్నారు.
ఇందులో కొన్ని ఉద్యోగాలు సహేతుకమైనవి అయినప్పటికీ ఎక్కువ శాతం మెడికల్ బోర్డు అవినీతి కారణంగానే జరిగాయనే ఆరోపణలున్నాయి. యేడాదిగా సింగరేణిలో మెడికల్ బోర్డు జరుగడం లేదు. ఇప్పటికే ఈ విషయంపై కార్మికవర్గం ఆందోళన చెందుతున్న సందర్భంలో గతంలో జరిగిన మెడికల్ బోర్డులపై విచారణలు అనే ప్రచారం కార్మికవర్గాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ అంశంపై కార్మిక సంఘాలు కూడా ఇది తేనెతెట్టెను కదలించడం తప్ప ఇందులో ప్రయోజనం ఏమి ఉండదనేది అభిప్రాయ పడుతున్నాయి. సింగరేణి సంస్థకు సంబంధించిన మెడికల్ బోర్డు ఆమోదించి, ఉద్యోగాల్లో చేరి పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారిపై విచారణ జరిపితే కార్మికవర్గం నుంచి తిరుగుబాటు వస్తుందని పేర్కొంటున్నాయి. ఇదంతా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడానికి, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను నిలిపివేయడానికి ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం చేస్తున్న కుట్రగా పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మెడికల్ అన్‌ఫిట్ కేసుల్లో ఎవరైనా అనర్హులు ఉద్యోగాలు పొందితే దానికి కార్మికుల కంటే సింగరేణి మెడికల్ బోర్డు, యాజమాన్యమే దోషిగా నిలబడాల్సి ఉంటుందని సంఘాలు వాదిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు ప్రభుత్వం, యాజమాన్యం ఎలాంటి ఏసీబీ విచారణను కోరలేదని యాజమాన్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.