Share News

దర్జాగా రహదారుల ఆక్రమణ

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:22 PM

నిత్యం రద్దీగా ఉండే గోదావరిఖని వ్యాపార, వాణిజ్య కూడలి అయిన శివాజీనగర్‌, మేదరిబస్తీ, లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌లోని కొందరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. వాహనాలను దుకాణాల ఎదుట పార్క్‌ చేస్తున్నా మున్సిపల్‌ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దర్జాగా రహదారుల ఆక్రమణ

కళ్యాణ్‌నగర్‌, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): నిత్యం రద్దీగా ఉండే గోదావరిఖని వ్యాపార, వాణిజ్య కూడలి అయిన శివాజీనగర్‌, మేదరిబస్తీ, లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌లోని కొందరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. వాహనాలను దుకాణాల ఎదుట పార్క్‌ చేస్తున్నా మున్సిపల్‌ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పండుగల సమయంలో రద్దీగా ఉండే ఈ ఏరియాల్లో జనం నడవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మీనగర్‌లోని కొందరు వ్యాపారులు రోడ్డుపైకి వచ్చి ప్రజలకు, ద్విచక్ర వాహనాలకు ఇబ్బందులు కలిగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో రుకుగా ఉన్న రోడ్లను ఇటీవల రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ విస్తరించి సుందరంగా తీర్చిదిద్దారు. వ్యాపారులు మాత్రం సీసీ రోడ్లను ఆక్రమించి దుస్తులు, బోళ్లు, బ్యాగులు పెడుతూ జనాన్ని నడవనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దుస్తుల దుకాణాల యజమానులు రోడ్డును సగం ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నారు. అలాగే బోళ్ల వ్యాపారులు, కళ్యాణ్‌నగర్‌లోని ఓ ఫార్మసీ సిబ్బంది ఏకంగా రోడ్డుపై షామియానాలు వేసి వస్తువులను అమ్మకానికి పెట్టారు. దీంతో వాహనాలు వెళ్లక చాలా సేపు ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మున్సిపల్‌ అధికారులు తమకు సం బంధం లేనట్టుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విస్తరణకు సహకరించని వ్యాపారాలు...

మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా ఇటీవల రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ రీగల్‌ షూమార్ట్‌, మేదరిబస్తీ, లక్ష్మీనగర్‌, డాక్టర్స్‌ స్ర్టీట్‌, కళ్యాణ్‌నగర్‌, అబ్దుల్‌ కలాం విగ్రహం వరకు రోడ్ల విస్తరణ చేపట్టారు. విస్తరణకు ముందుకు రాని వ్యాపారులు ఆక్రమణలను తొలగించాలని చెప్పినప్పటికీ వినడంలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే వ్యాపారులు దురుసుగా ప్రవరిస్తున్నారు.

ఆటోవాలాల పోటాపోటీ

రోడ్లు విస్తరణ తరువాత ఆటో డ్రైవర్లు వాణిజ్య, వ్యాపార కూడళ్లలో వేగంగా తిప్పుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లక్ష్మీనగర్‌లో ప్రధానంగా బాలాజీ స్వీట్‌హౌస్‌, డాక్టర్స్‌ స్ర్టీల్‌, కళ్యాణ్‌నగర్‌లలో ప్రయాణికులను ఎక్కించుకోవడానికి పోటీపడుతూ ఆటో వాలాలు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. చాలా మంది వ్యాపారులు రోడ్లపైకి వచ్చి వస్తువులు పెట్టి వ్యాపారాలు నిర్వహిస్తున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. చలాన్లను విధించడంలో ముందున్న ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణను పట్టించుకోవడం లేదు. రోడ్ల విస్తరణ జరిగినా పాత పద్ధతిలోనే వ్యాపారులు వ్యవహరిస్తుండడంతో వారి చర్యలను ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు, మున్సిపల్‌ అధికారులు ఇప్పటికైనా రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Feb 19 , 2026 | 11:22 PM